పుట:సత్యశోధన.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

215

మొదలుగాగల చోట్ల బిచ్చగాళ్లకు కాణీకూడా యివ్వకూడదని అప్పటికే నేను నిర్ణయించుకొన్నాను. చాలామంది బిచ్చగాళ్లు నా వెంటబడ్డారు. ఒక బాబాజీ ఎత్తగు నలుచదరపు రాతికట్టడం మీద కూర్చొని వున్నాడు. ఆయన నన్ను దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను, ఒక మిత్రుడు ఆయన దగ్గరకు వెళ్లాము. “నాయనా! ఎక్కడికి పోతున్నావు.” అని ఆయన నన్ను అడుగగా, తగిన సమాధానం చెప్పాను. ఆయన నన్ను, నామిత్రుణ్ణి కూర్చోమని చెప్పగా మేము కూర్చున్నాము “అయ్యా! ఇన్ని గొర్రెల్ని బలివ్వడం ధర్మమని మీరు భావిస్తున్నారా?” అని అడిగాను. “జీవహత్య ధర్మమని ఎవరంటారు?” అని ఆయన అన్నాడు.

“మీరిక్కడ కూర్చున్నారు గదా? జనానికి బోధించకూడదా?”

“అది నా పనికాదు. భగవత్సేవయే నా పని”

“అందుకు మీకు యీ చోటే దొరికిందా? వేరే చోటుదొరకలేదా?”

“ఎక్కడ బడితే అక్కడ కూర్చుంటాను. నాకన్ని చోట్లు ఒక్కటే, లోకులగోల నాకెందుకు? వాళ్లొక గొర్రెల మంద. ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోతారు. వారితో మాకేమిపని?”

నేనిక సంభాషణను పెరగనీయలేదు. తరువాత నేను దేవాలయంలోకి వెళ్లాను. ఎదురుగా రక్తపుమడి చూచి బిత్తరపోయాను. నిలబడలేకపోయాను. పెద్ద క్షోభ కలిగింది. తలక్రిందులయ్యాను. ఆ దృశ్యం ఈనాటికీ మరువలేను. ఆ సమయాన ఒక బెంగాలీ సంఘం వారు నన్ను విందుకు పిలిచారు. ఇక్కడ ఒక సజ్జనునితో ఘాతుకమగు జంతుబలిని గూర్చి ముచ్చటించాను. “అక్కడ బలియిచ్చే సమయంలో చెవులు రింగుమంటూ నౌబత్‌ఖానాలు మోగుతూ వుంటాయి. ఈ గందర గోళంలో గొర్రెలకు మృత్యుబాధ తెలియదు” అనే ఆ సజ్జనుడు అన్నాడు. వారి మాటలు నాకు రుచించలేదు. ‘ఆ గొర్రెలకి నోరుంటే ఊరుకోవు. ఘోరమైన ఈ ఆచారాన్ని ఆపివేయాలి.’ అని అన్నాను. నాకు బుద్దుని కథ జ్ఞాపకం వచ్చింది. కాని దానిని ఆపడం మాత్రం నా శక్తికి మించిన పనియని అనిపించింది.

ఈ విషయంలో అప్పుడు ఏవిధంగా భావించానో ఇప్పుడు కూడా ఆ విధంగానే భావిస్తునాను. గొర్రె ప్రాణం విలువ మనుష్యుని ప్రాణం కంటే తక్కువ కాదు. మనిషి శరీరాన్ని పోషించేందుకు గొర్రెను చంపడం ఎన్నటికీ అంగీకరించలేను. జంతువు కడు నిస్సహాయమగు ప్రాణి. మనుష్యుని సాయం పొందుటకు అది అధికారి. అయితే దానికి సాయం చేయాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండటం