పుట:సత్యశోధన.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

గోఖ్లే గారితో ఒక మాసం - 2

తెలియచేస్తానని దక్షిణ ఆఫ్రికా యందలి క్రైస్తవ మిత్రులకు చెప్పి వచ్చాను. కాళీచరణ బెనర్జీగారి పేరు విన్నాను. వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా పని చేస్తున్నారు. అందువల్ల వారంటే నాకు ఆదరం పెరిగింది. సామాన్యంగా భారతదేశ క్రైస్తవులు కాంగ్రెస్ సభల్లో పాల్గొనరు. హిందువులతో, ముసల్మానులతో కలవరు. అందువల్ల క్రైస్తవుల యెడ కలిగిన ఆ విశ్వాసం కాళీచరణ బెనర్జీ గారి యెడ నాకు కలగలేదు. నేను వారిని దర్శిస్తానని గోఖ్లేగారితో అన్నాను. వారిని చూచి ఏం చేస్తావు? వారు చాలా యోగ్యులే. కాని వారిని దర్శించినందున నీకు సంతృప్తి కలుగదని భావిస్తున్నాను. నీవు చూడదలుచుకుంటే తప్పక చూడు అని గోఖ్లే అన్నారు. నేను కాళీబాబు దర్శనం కోసం జాబు పంపాను. వారు వెంటనే అనుమతి యిచ్చారు. వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాను. ఇంట్లో వారి ధర్మపత్ని మృత్యుశయ్యమీద పడివున్నది. ఇల్లంతా నిరాడంబరంగావుంది. కాంగ్రెస్‌లో వారు కోటు, ఫాంటు ధరించి పాల్గొనేవారు. కాని యింట్లో బెంగాలీ ధోవతి కట్టుకొని వున్నారు. వారి నిరాడంబరత్వం చూచి ముగ్ధుడనయ్యాను. వారి సమయం వ్యర్థం చేయకుండా నా గొడవ చెప్పకున్నాను. “పాపాలతో బాటు మనకు పునర్జన్మ కలదను సిద్ధాంతం మీరు నమ్ముతారా?” అని వారు ప్రశ్నించారు.

“తప్పక నమ్ముతాను.”

“అయితే ఈ పాప నివారణోపాయం హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. కాని క్రైస్తవ ధర్మంలో వుంది” అని చెప్పి “పాపాలకు ఫలం మృత్యువు. యీ మృత్యువును తప్పించుకొనుటకు ఏసుక్రీస్తే శరణ్యం” అని అన్నారు.

నేను వారికి గీతలో చెప్పబడిన భక్తి యోగాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నించాను. కాని నా ప్రయత్నం వృధా అయింది. నేను వారి సౌజన్యానికి ధన్యవాదాలు సమర్పించాను. మా సంభాషణ వల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని లాభం చేకూరింది. నేను కలకత్తాలో గల వీధివీధిన బాగా తిరిగాను. చాలా దూరం నడిచాను. అప్పుడే న్యాయమూర్తి మిత్రగారిని, సర్‌గురుదాసబెనర్జీ గారిని దర్శించాను. దక్షిణ ఆఫ్రికా పనులకు వారి సాయం అవసరం. రాజాసర్‌ప్యారీ మోహన్‌ముఖర్జీగారి దర్శన భాగ్యం కూడా కలిగింది.

కాళీ చరణ బెనర్జీగారు కాళికాలయాన్ని గురించి నాకు చెప్పారు. ఒక పుస్తకంలో దాని వర్ణన చదివాను. న్యాయమూర్తి మిత్రగారి గృహం ఆ ప్రాంతంలోనే వున్నది. వారి దర్శనం చేసుకొని ఆ దారినే వస్తూ కాళికాలయం దగ్గరకి వెళ్ళాను. కాళికాదేవికి బలికాబోతున్న గొర్రెల మందను త్రోవలో చూచాను. ఆలయం సందుల్లో బిచ్చగాళ్లు గుంపులు గుంపులుగా వున్నారు. బైరాగి బాబులు సరేసరి. సంతలు, బజార్లు