పుట:సత్యశోధన.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

205

పనులు చేయించుకుంటూ వుంటారు. ‘ఏయ్! వాలంటీరూ! అది తే, ఇది తే’ యిదీ వాళ్ల వరస. ఇక్కడ అంటరానితనం జాస్తి. అరవవారికోసం వంట యిల్లు స్పెషల్‌గా ఏర్పాటుచేయబడింది. వాళ్లు భోజనం చేస్తుంటే ఎవ్వరూ చూడకూడదు. అందువల్ల వారికోసం కాలేజీ ఆవరణలో వేరే ఏర్పాట్లు చేశారు. దిష్టి తగలకుండా చుట్టూ దడికట్టారు. లోపల ఊపిరి సలపనంత పొగ. అది వంట గదిలా లేదు. సందూకు పెట్టెలా వుంది. అన్ని వైపుల దాన్ని మూసివేశారు.

ఇది వర్ణాశ్రమ ధర్మానికి విరుద్దం. కాంగ్రెసు ప్రతినిధుల్లోనే అంటరానితనం యింత అధికంగా వుంటే వాళ్లను ఎన్నుకునే జనంలో ఎంత అంటరానితనం వుంటుందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారమంతా చూసేసరికి నాకు అమితంగా నిరాశ కలిగింది.

ఇక అక్కడ దుర్గంధం విపరీతం. ఎక్కడ చూచినా నీళ్లు, నీళ్లు, నీళ్లు. మరుగు దొడ్లు తక్కువగా వున్నాయి. ఒకటే కంపు. తలుచుకుంటేనే డోకు వస్తుంది. ఒక వాలంటీరుని పిలిచి యీ విషయం చెప్పాను. అది పాకీ వాళ్లు చేయాల్సిన పని అని అతడు ఠపీమని సమాధానం యిచ్చాడు. ‘నాకు ఒక చీపురు కట్ట తెచ్చి పెట్టగలరా’ అని అడిగాను. అతడు తెల్లబోయాడు, నా ముఖం ఎగాదిగా చూడసాగాడు. చివరికి నేనే వెతికి తెచ్చుకున్నాను. మరుగుదొడ్డి బాగు చేశాను. కాని అది నాకు ఉపయోగపడే మరుగుదొడ్డి. ఇదెక్కడి లోకం? ఇవెక్కడి మరుగుదొడ్లు? ఎన్ని సార్లు బాగుచేసినా ప్రయోజనం శూన్యం. వాటిని బాగుచేయాలంటే నా శక్తికి మించినపని. అందువల్ల నాపని మాత్రం చేసుకొని సంతోషపడ్డాను. మిగతావాళ్లకు కంపు కొట్టినట్లులేదు. ఈ వ్యవహారం యింతటితో ఆగలేదు. కొందరు రాత్రిపూట తాము వుంటున్న గది వరండాలోనే మలవిసర్జనం, మూత్ర విసర్జనం చేశారు. వాలంటీర్లకు ప్రొద్దున్నే ఆ దృశ్యం చూపించాను. కాని బాగుచేసే నాధుడెవరు? చివరికి నాకే ఆ గౌరవం దక్కింది.

తరువాత మొదటి కంటే కొద్దిగా మార్పు వచ్చింది. కాని పరిశుభ్రతను గురించి పట్టించుకునేవారు తక్కువ. ప్రతినిధులు తమ చెడ్డ అలవాటును మార్చుకోరు. వాలంటీర్లు అసలు పట్టించుకోరు.

కాంగ్రెస్ మరికొన్ని రోజులు యిలాగే జరిగితే అంటురోగాలు తప్పవు అని అనిపించింది.