పుట:సత్యశోధన.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

203

13. భారతదేశానికి ప్రయాణం

ఈ విధంగా నేను ఏర్పాట్లు పూర్తిచేసుకొని భారత దేశానికి ప్రయాణమయ్యాను. దారిలో మారిషస్ రేవు తగిలింది. అక్కడ ఓడ కొద్ది రోజులు ఆగుతుంది. నేనక్కడ దిగి అక్కడ వారి స్థితిగతుల్ని తెలుసుకున్నాను. అక్కడ గవర్నరుగా వున్న చార్లెస్‌బ్రూస్ గారికి అతిథిగా ఒక రాత్రి వున్నాను.

దేశానికి వచ్చిన తరువాత కొంత కాలం అటుయిటు తిరుగుతూ పర్యటిస్తూ వున్నాను. 1901 నాటి విషయం, కలకత్తాలో ఆ ఏడు కాంగ్రెస్ జరుగుతున్నది. అధ్యక్షులు దిన్షా ఎడల్జి వాచాగారు. నేను ఆ కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కాంగ్రెస్‌ను చూడటం నాకు అదే మొదటిసారి.

బొంబాయి నుండి సర్‌ఫిరోజ్‌షాగారు కలకత్తా వెళుతున్న రైల్లోనే నేను కూడా ఎక్కాను. దక్షిణ - ఆఫ్రికా విషయాలు వారితో మాట్లాడవలసి వున్నది. వారి పెట్టెలో కూర్చొని ఒక స్టేషను దాకా ప్రయాణించవచ్చని నాకు అనుమతి లభించింది. వారు ఒక పెట్టెను పూర్తిగా తీసుకున్నారు. వారి రాజ వైభవం, ఠీవి, అందుకుగాను అయ్యే ఖర్చుల వ్యవహారమంతా నాకు కొంత తెలుసు. నిర్ణయించబడిన స్టేషనులో వారి పెట్టె ఎక్కాను. అప్పుడా పెట్టెలో దిన్షావాచాగారు, చిమన్‌లాల్ సెతల్వాడు గారు వున్నారు. వారంతా రాజకీయాల్ని గురించి మాట్లాడుతూ వున్నారు. నన్ను చూచి ఫిరోజ్ షా మెహతా గారు “గాంధీ! నీ పని అనుకూలంగా లేదు. నీ తీర్మానం కాంగ్రెస్సులో ఆమోదించినా ప్రయోజనం ఏముంటుంది? అసలు మనకు మనదేశాల్లో వున్న హక్కులేమిటి? మనదేశంలో మనకు సత్తా లేనంత కాలం పరాయి దేశాల్లో మన స్థితి ఎలా బాగు పడుతుంది?” అని అన్నారు. నేను నివ్వెరబోయాను. చిమన్‌లాల్‌గారు కూడా వారితో ఏకీభవించారు. కాని దిన్షాగారు మాత్రం దయ దృష్టితో నావంక చూచారు.

ఫిరోజ్‌షాగారిని ఒప్పించాలని ప్రయత్నించాను. వారు బొంబాయికి మకుటంలేని మహీపతి. అట్టివారిని నాబోటివాడు ఒప్పించడం సాధ్యమా? అయితే కాంగ్రెస్‌లో దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించిన తీర్మానం ఆమోదం పొందుతుందని సంతోషించాను.

వారికి ధన్యవాదాలు తెలిపి రైలు ఆగగానే పెట్టె దిగి నా పెట్టె ఎక్కి నా స్థానంలో కూర్చున్నాను. షాగారి దగ్గర నుండి వచ్చేసేముందు లేవగానే నాకు ఉత్సాహం కలిగించేందుకు వాచాగారు “తీర్మానం తయారు చేసి నాకు చూపించండి” అని చెప్పారు.