పుట:సత్యశోధన.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

మితవ్యయం

అయితే ఎవరిపని వారు చేసుకోవడం మంచిదని వాళ్ళకు చెప్పలేక పోయాను. నాపని మాత్రం నేను చేసుకోసాగాను. క్రమంగా ఈ విద్యలో పాండిత్యం సంపాదించాను. నా ఇస్త్రీ చాకలి ఇస్త్రీ కంటే ఏ మాత్రమూ తీసిపోలేదు. చాకలి ఇస్త్రీ చేసిన కాలరు కంటే నేను ఇస్త్రీ చేసిన కాలరు నిగనిగలాడుతూ శుభ్రంగా ఉంది. క్రీ. శే. మహదేవ గోవిందరానడేగారు గోఖలేగారికి ఒక శాలువ ప్రసాదించారు. గోఖలేగారు దాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ ప్రత్యేక సమయాల్లో దాన్ని వాడుతూ ఉండేవారు. జోహన్సుబర్గులో గోఖలేగారికి ఘనంగా మేము విందు చేశాము. అది గొప్పసభ. అప్పుడు వారిచ్చిన ఉపన్యాసం దక్షిణ ఆఫ్రికాలో వారిచ్చిన ఉపన్యాసాలన్నిటి కంటే గొప్పగా ఉంది. అప్పుడువారు ఆశాలువా వేసుకోవాలని అనుకున్నారు. ఆ శాలువా మడతపడి ఉన్నది. దాన్ని ఇస్త్రీ చేయించాలి. సమయం తక్కువ. చాకలి చేత ఇస్త్రీ చేయించి తేవడం కష్టం “నా విద్యను కొద్దిగా పరీక్షించండి” అని వారిని కోరాను.

‘నీ లాయరు విద్యను విశ్వసించవచ్చుగాని చాకలి విద్యను ఎలా విశ్వసించడం? నీవు దీని మీద మరకలు వేస్తే ఎలా? దీని వెల ఎంతో తెలుసా’ అని అంటూ ఆ శాలువా కథ చెప్పారు.

మరకలు పడకుండా శాలువా సరిచేస్తానని వారికి విన్నవించాను. తత్ఫలితంగా ఆ శాలువా ఇస్త్రీ చేసే గౌరవం నాకు దక్కింది. వారు నాకు “మంచి చాకలి” అని బిరుదు ఇచ్చారు. ఇక చాలు లోకమంతా ఇవ్వకపోయినా పర్వాలేదని అనిపించి సంబరపడ్డాను. చాకలి దాస్యం నుండి బయట పడినట్లుగానే మంగలి దాస్యం నుండి బయటపడవలసిన అవసరం ఏర్పడింది. ఇంగ్లాండు వెళ్ళినవారంతా కనీసం తన గడ్డమైనా చేసుకోవడం నేర్చుకుంటారు. కాని తల వెంట్రుకలు కత్తిరించుకోవటం నేర్చుకోరు. ప్రిటోరియాలో ఒకసారి నేను మంగలి దుకాణానికి వెళ్ళాను. అక్కడ మంగలి “నాకు క్షవరం చేయను, పో” అని అన్నాడు. చేయనంటే పరవాలేదు. కాని ఆ తిరస్కారం భరించలేకపోయాను. బజారుకు వెళ్లి కత్తెర ఒకటి కొన్నాను. అద్దం ఎదుట నిలబడి నేనే జుట్టు కత్తిరించుకున్నాను. ముందరి వెంట్రుకలు ఏదో విధంగా కత్తిరపడ్డాయి. కాని వెనుక వెంట్రుకలు కత్తిరించుకోవడం కష్టమైంది. నేను కోరుకున్నట్లు కత్తెర పడలేదు. ఆ విధంగా జుట్టు కత్తెర వేసుకుని కోర్టుకు హాజరయ్యాను. కోర్టులో కలవరం బయలుదేరినది.

“నీ మీద ఎలుకలు తిరుగుతున్నాయా ఏమి” అని ఒకడు ప్రశ్నించాడు. ‘లేదు నా నల్లవాడి తలను తెల్లమంగలి అంటడు కదా! అందుకని నేను వెంట్రుకల్ని ఏదో విధంగ కత్తిరించుకున్నాను, యిది నాకు ఎంతో హాయినిచ్చింది.’ అని చెప్పాను.