పుట:సత్యశోధన.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

193

ఆహారం మానివేసిన వాడికి విషయములు శాంతించును. కాని అందుండు అభిరుచి శాంతించదు. ఈశ్వర దర్శనం వల్లనే అట్టి అభిరుచి శమించును. కావున ఆత్మ దర్శనం కావలసిన వారికి రామనామం, రామకృప సాధనాలు అవసరం. నేను భారతదేశానికి వచ్చిన తరువాతనే ఈ విషయం తెలుసుకున్నాను. అది నాకు కలిగిన అనుభవం.

9. మితవ్యయం

నేను సుఖాలు అనుభవించసాగాను. కాని ఎంతోకాలం సాగలేదు. గృహాలంకరణకు అవసరమనుకున్న సామాగ్రిని సమకూర్చాను. కాని ఆ వ్యామోహం కూడా నిలవలేదు. దానితో వ్యయం తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చాను. చాకలి ఖర్చు ఎక్కువగా వుందని అనిపించింది. అంతేగాక అతడు బట్టలు త్వరగా తీసుకురాడు. అందువల్ల రెండుమూడు డజన్ల కమీజులు, అన్ని కాలర్లు వున్నా చాలేవి కావు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కాలరు. రోజూ కాక పోయినా మూడురోజులకొక కమీజు చొప్పున మారుస్తూ వుండేవాణ్ణి. యిందుకు వ్యయం పెరిగింది. ఈ వ్యయం అవసరమని అనిపించింది. నేను యింట్లో బట్టలుతకడం ఎలా అను పుస్తకాలు తెప్పించి చదివాను. నా భార్యకు కూడా నేర్పాను. పని పెరిగింది. కాని యిది క్రొత్తపని కావడంవల్ల మనోవినోదం కూడా కలిగింది.

మొట్టమొదటిసారి నేను ఉతికి ఇస్త్రీ చేసిన కాలరు మరచిపోవడానికి వీలు లేనంతగా పనిచేసింది. పిండి ఎక్కువైంది. ఇస్త్రీ పెట్టె వేడెక్కలేదు. కాలరు కాలిపోతుందేమోనని భయంతో ఇస్త్రీ పెట్టెను అణిచి రుద్దలేదు. అందువల్ల కాలరు గట్టిపడింది. పిండి రాలుతూ వుంది. ఆ కాలరుతో కోర్టుకు వెళ్ళి తోటి బారిస్టర్ల హాస్యానికి గురి అయ్యాను. అయితే యిట్టిహాస్యాన్ని సహించగలశక్తి నాకు చేకూరేవుంది. కాలరు ఇస్త్రీ చేసుకోవడం యిదే ప్రధమం. కనుక కాలరు నుండి పిండి రాలితే ఏం? మీకందరికి వినోదం కల్పించింది. ఇది గొప్ప విశేషం కదా! అంటూ స్పష్టంగా చెప్పాను. “ఇక్కడ చాకళ్ళకు కరువు లేదు కదా?” అని ఒక మిత్రుడు అన్నాడు.

“చాకలి ఖర్చు అత్యధికంగా పెరిగిపోయింది. కాలరు ధర ఎంతో దానిని ఉతికిoచడానికి అంత ఖర్చు అవుతున్నది. అంతేకాక చాకలివాని కోసం పడిగాపులు కాయవలసి వస్తున్నది. ఈ కష్టాలు పడేకంటే నా బట్టలు నేనే ఉతుక్కోవడం మంచిదని భావించాను.”