పుట:సత్యశోధన.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

బ్రహ్మచర్యం - 2

బ్రహ్మచర్యాన్ని సరిగా పాటించడం అంటే బ్రహ్మదర్శనం చేసుకోవడమేనన్నమాట. ఈ జ్ఞానం నాకు శాస్త్రాలు చదవడంవల్ల కలుగలేదు. నాకీ విషయం మెల్ల మెల్లగా అర్ధం కాసాగింది. తరువాత శాస్త్రాలు చదివాను. బ్రహ్మచర్య వ్రతధారణం వల్ల శరీర రక్షణ, బుద్ధి రక్షణ, ఆత్మ రక్షణ కలుగునను సంగతి బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించిన తరువాత రోజురోజుకు అధికంగా అనుభవంలోకి రాసాగింది. ప్రారంభంలో బ్రహ్మచర్యవ్రతమంటే ఘోరతపశ్చర్యయని భావించేవాణ్ణి. కాని ప్రారంభించిన తరువాత యిప్పుడు ఎంతో రసమయంగాను, ఆనందమయంగాను వున్నది. యిప్పడు దీని బలం వల్లనే పనులు జరుగుతున్నాయి. దీని సౌందర్యం రోజురోజుకు అధికంగా పెరుగుతూ వున్నది.

ఈ వ్రతానికి పూనుకున్న తరువాత ఆనందం పొందుతున్నప్పటికీ దీని వేడి నాకు తగలలేదని భావించవద్దు. నేటితో నాకు యాభై ఆరేండ్లు నిండాయి. అయినా దీని కాఠిన్యం నాకు గోచరమవుతూనే వుంది. ఇది నిజంగా అసిధారావ్రతమే. ఎల్లప్పుడూ యీ విషయమై కడు జాగ్రత్తగా వుండటం అవసరం అని గ్రహించాను

బ్రహ్మచర్య వ్రతం సాఫీగా సాగాలంటే ముందు జిహ్వను వశంలో పెట్టుకోవాలి. నాలుకను జయించితే బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం తేలిక అని అనుభవం వల్ల గ్రహించాను. అందుకుగాను భోజనంలో మార్పులు చేశాను. శాకాహార దృష్టితోగాక, బ్రహ్మచర్య దృష్టితో భోజనంలో మార్పుచేశాను. మితంగా తినడం. వీలైనంత వరకు వండని పదార్థం తినడం. అనగా స్వాభావికమైన భోజనం అవసరమని అనుభవం వల్ల తెలుసుకొన్నాను. బ్రహ్మచారికి అడవిలో పండిన పండ్లు సరియైన ఆహారమని ఆరేళ్ళు కృషిచేసి తెలుసుకున్నాను. పండ్లు తినే సమయంలో నాకు కలిగిన నిర్వికారభావం, సుఖం, పండ్లు తినడం మానివేసే మరో పదార్థం తిన్నప్పుడు కలుగలేదు. పండ్లు తింటూ వున్నప్పుడు బ్రహ్మచర్యం సులభమైంది. పాలు పుచ్చుకుంటూ వున్నప్పుడు ఆ వ్రతాన్ని పాలించడం కష్టమనిపించింది. పండ్లు తినడం మాని పాలు ఎందుకు త్రాగవలసి వచ్చిందో తరువాత తెలియజేస్తాను. బ్రహ్మచారికి పాలు పనికిరావని, అవి బ్రహ్మచర్యానికి విఘ్నకారకమని చెప్పక తప్పదు. అయితే బ్రహ్మచారికి పాలు నిషిద్ధమని భావించవద్దు. బ్రహ్మచర్యానికి ఆహార ప్రాముఖ్యం ఏపాటిది? ఎంత? ఈ విషయంలో. యింకా ప్రయోగాలు చేసి చూడటం అవసరం. పాలు ఎంతో జీర్ణకరం, స్నాయువర్ధకం. అలాంటి ఆహారం మరొకటి యింతవరకు లభించలేదు. అట్టిది మరొక్కటి వున్నదని ఏ వైద్యుడు, ఏ హకీము, ఏ డాక్టరు కూడా చెప్పలేదు. పాలు కామవికారం కలిగిస్తాయి. అయినా పైన తెలిపిన కారణం వల్ల పాలు త్యాజ్యమని కూడా అనలేను.