పుట:సత్యశోధన.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్ధించుకోవడం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటిమీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా వుంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణకూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూచాను. విశ్లేషించి చూచాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరియైనవని నేను ఎన్నడూ చెప్పదలచలేదు. అయితే యివి నా దృష్టిలో సరియైనవని, యీ నాటికి యివి చివరివని మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాదిమీద ఏవిధమైన భవనం నిర్మించలేము. చూచిన వస్తువులను అడుగడుగునా పరిశీలించి ఇవి త్యాజ్యాలు, ఇవి గ్రాహ్యాలు అని రెండు రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలనుబట్టి నా ఆచరణను మలుచుకుంటాను. ఆ విధంగా మలుచుకున్న ఆచరణ ఎప్పటివరకు నాకు, నా బుద్ధికీ, నా ఆత్మకు తృప్తి, సంతోషం కలిగిస్తూవుంటుందో అంతవరకు దాని శుభపరిణామాలను విశ్వసిస్తూవుంటాను.

కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించిన వర్ణనే ముఖ్యమని భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవలసిన అవసరం లేదు. కాని ప్రయోగాలపై చేసిన కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా కృషికి ప్రధమంగా సత్యశోధన అని పేరు పెట్టాను. ఇందు సత్యానికి భిన్నమనీ భావించబడే అహింస, బ్రహ్మచర్యం మొదలుగాగలవాటిని గురించిన ప్రయోగాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలువిషయాలు నిహితమై వుంటాయి. ఈ సత్యం స్థూలంగా వుండే వాకృత్వం కాదు. ఇదీ వాక్కుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యంగాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్తిత్వంగల సత్యం. అంటే సాక్షాత్ పరబ్రహ్మమన్నమాట.

పరమేశ్వరునికి వ్యాఖ్యలు అనేకం. గొప్పతనాలుకూడా అనేకం. ఆ గొప్పతనాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. కొద్ది సేపు నన్ను మోహింపచేస్తాయి. నేను సత్యస్వరూపుడగు పరమేశ్వరుని పూజారిని. అతడొక్కడే సత్యం. మిగిలిందంతా మిధ్యమే. ఆ శోధన కోసం నాకు ఎంతో ప్రీతికరమైన వస్తువును సైతం త్యజించివేయుటకు నేను సిద్ధమే. ఈ శోధనాయజ్ఞంలో శరీరాన్ని సైతం హోమం చేయడానికి నేను సిద్ధమే. అట్టి శక్తి నాకు కలదనే నమ్మకం వున్నది. ఆ సత్యసాక్షాత్కారం కలుగనంతవరకు నాఅంతరాత్మదేన్ని

XX