పుట:సత్యశోధన.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

185

దొరకడం సాధ్యమా? అందుకని నేను సుఖ ప్రసవాన్ని గురించి పుస్తకం కొని చదివాను. డా|| త్రిభువన దాసు గారు రచించిన మానేశిఖావణ తల్లులకు ఉపదేశము అను పుస్తకం అది. ఆ పుస్తకం ప్రకారం మరియు యితరత్ర నాకు లభించిన అనుభవం ప్రకారం ఇద్దరు పిల్లలకి లాలన పాలన నేనే చేశాను. రెండుసార్లు మంత్రసానుల సాయం పొందాను. కాని రెండు రెండు మాసాల కంటే మించి వారి సాయం లభించలేదు. వారి సహాయం నా భార్య వరకే పరిమితమైంది. పిల్లలకు తలంటువంటి సమస్త పనులు నేనే చేశాను. మా చివరివాడి పుట్టుక నన్ను కఠిన పరీక్షకు లోను చేసింది. ప్రసవ వేదన హఠాత్తుగా ప్రారంభమై ఎక్కువైంది. డాక్టరు సమయానికి దొరకలేదు. మంత్రసానిని పిలవాలి. మంత్రసాని దగ్గరలో వుంటే ఆ సమయంలో పిలవవచ్చు. కాని అందుకు అవకాశం లేదు. నొప్పులు ఎక్కువైనాయి. దానితో నేనే పురుడు పోయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు త్రిభువనదాసు పుస్తకం చదివాను గనుక నాకు భయం కలుగలేదు. ఆ గ్రంధ పఠనం నాకు అమితంగా సహాయపడింది.

పిల్లల పోషణను గురించి జ్ఞానం సంపాదించి నేను మా పిల్లల్ని పెంచి యుండకపోతే వాళ్లు ఆరోగ్యం విషయంలో వెనుకబడి యుండేవారే. సామాన్యంగా మొదట అయిదేండ్ల వరకు పిల్లలు నేర్చుకునేది ఏమీ వుండదని జనం అనుకుంటూ వుంటారు కాని అది సరికాదు. అసలు మొదటి అయిదేండ్ల సమయంలో పిల్లలు గ్రహించినంతగా ఆ తరువాత గ్రహించరు. శిశువుకు విద్యారంభం తల్లి గర్భంలోనే ఆరంభం అవుతుంది. గర్భ ధారణ సమయంలో తల్లి దండ్రుల శారీరక మానసిక ప్రవృత్తుల ప్రభావం శిశువునందు ప్రసరిస్తుంది. తల్లి గర్భం మోస్తున్నప్పుడు ఆమె ప్రకృతిని, ఆహార విహారాల్ని, గుణ దోషాల్ని స్వీకరించి శిశువుకు జన్మనిస్తుంది. జన్మించిన తరువాత తల్లిదండ్రుల్ని అనుకరిస్తుంది. తరువాత కొన్ని సంవత్సరాల దాకా తన వికాసానికి పూర్తిగా తల్లి దండ్రులమీద ఆధారపడుతుంది.

ఈ సంగతులు తెలిసిన దంపతులు కేవలం కామ తృప్తి కోసం తంటాలు పడరు. సంతానం కోసం వాళ్లు కాపురం చేస్తారు. నిద్రవలె, ఆహారంవలె సంయోగం అవసరం అని అనుకోకుండా పూర్తిగా అజ్ఞానమని నా అభిప్రాయం. అసలు ఈ జగత్తు యొక్క అస్తిత్వం జనన క్రియపై ఆధారపడి వున్నది. ఈ లోకం భగవంతుని లీలాభూమి. అతని మహిమకు ప్రతిబింబం. స్త్రీ పురుష సంయోగ సంతానం యొక్క సక్రమాభివృద్ధికి నిర్మితమని తెలుసుకుంటే భగీరధ ప్రయత్నం చేసి అయినా మనిషి తన లాలసత్వాన్ని పోగొట్టుకొనగలడు. ఆ విధంగా జరగాలని నా అభిలాష. సంయోగం