పుట:సత్యశోధన.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

సేవా ప్రవృత్తి

నాకు తృప్తి కలుగలేదు. ఎల్లప్పుడూ చేయతగిన శుశ్రూషాకార్యం ఏదైనా దొరికితే బాగుండునని ఆశపడ్డాను. డా. బూత్‌గారు సెయింట్ ఏయిడాన్స్ మిషన్‌కు అధికారులు. ఎవరు వచ్చినా వారు ఉచితంగా మందులిస్తూ వుంటారు. ఆయన ఎంతో మంచివాడు. వారి హృదయ స్నేహమయం. డా. బూత్ గారి ఆధిపత్యాన పారసీ రుస్తుంజీ ధర్మంతో ఒక ఆసుపత్రి పెట్టబడింది. అందు నర్సుపని చేద్దామని నాకు ప్రబలంగా కోరిక కలిగింది. అక్కడ రెండు గంటల సేపు మందులిచ్చే పని ఒకటి వున్నది. డబ్బు తీసుకోకుండా ఆ పని చేయగల స్వచ్ఛంద సేవకుడు కావలసి వచ్చింది. ఆ పని నేను చేయాలని, ఇతర పనుల నుండి ఏదో విధంగా రెండు గంటల సమయం మిగిల్చి, యీ పనికి వినియోగించాలని నిర్ణయించుకున్నాను. ఆఫీసులో కూర్చొని సలహాలివ్వడం, దస్తావేజులకు ముసాయిదా తయారుచేయడం, తగాదాలు పరిష్కరించడం నా పసులు. నాకు మేజిస్ట్రేటు కోర్టులో కూడా పనులు వుండేవి. కాని అవి అంత వివాదస్పదాలు కావు. యీ కేసుల్లో నాకు ఖానుగారు సాయం చేస్తున్నారు. వీరు నాతోబాటు దక్షిణ - ఆఫ్రికాకు వచ్చారు. మా యింట్లోనే వుండేవారు. వారి సాయంవల్ల ఆ చిన్న ఆసుపత్రిలో పనిచేసేందుకు నాకు అవకాశం ఆభించింది. అక్కడ ప్రతిరోజూ ఉదయం పూట పని. రాకపోకలకు, అక్కడ పని చేయడానికి రోజూ రెండు గంటలు పట్టేది. యీ పని వల్ల నా మనస్సుకు కొంచెం శాంతి లభించింది. రోగుల రోగాల్ని, బాధల్ని అడిగి తెలుసుకొని డాక్టరుకు చెప్పడం, డాక్టరు చెప్పిన మందు తయారుచేసి రోగులకు యివ్వడం యిదీ నా పని. దీనివల్ల రోగపీడితులైన హిందూదేశవాసులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారిలో చాలామంది అరవవారు, తెలుగువారు, ఉత్తరాదివారు. అంతా గిరిమిటియాలు.

ఆ చికిత్సా జ్ఞానం తరువాత నాకు ఎంతో ఉపయోగపడింది. బోయరు యుద్ధ సమయంలో దెబ్బలు తిన్నవారికీ, రోగులకు సేవ చేయడానికి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది.

పిల్లల పోషణను గురించిన సమస్య ఎప్పుడూ నన్ను వేధిస్తూ వుండేది. దక్షిణ ఆఫ్రికాలో నాకు యిద్దరు కుమారులు కలిగారు. వారి పోషణకు కూడా ఆసుపత్రిలో కలిగిన అనుభవం బాగా ఉపయోగపడింది. నా స్వతంత్ర ప్రవృత్తి నాకు ఎప్పడూ కష్టం కలిగిస్తూ వుండేది. యిప్పటికీ కలిగిస్తున్నది. ప్రసవం శాస్త్రీయంగా జరపాలని దంపతులు అనుకున్నాం. అయితే డాక్టరుగాని, మంత్రసానిగాని సమయానికి రాకపోతే ఏంచేయాలి? చదువుకున్న మంత్రసాని హిందూ దేశంలోనే దొరకనప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో