పుట:సత్యశోధన.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

183

నా యీ ప్రయోగాల ప్రయోజనాన్ని గురించి నిర్ణయించవలసింది భవిష్యత్తే. మనుష్యజాతి అభివృద్ధిని పరిశీలించే శోధకుడు గృహ శిక్షణకు, స్కూలు శిక్షణకు గల భేదాన్ని తెలుసుకోవాలని, తల్లిదండ్రుల జీవితంలో కలిగే పరివర్తనల ప్రభావం పిల్లల పై ఏవిధంగా పడుతుందో గమనించాలని భావించి యీ వివరం యిక్కడ తెలియచేశాను.

ఈ నా ప్రకరణానికి మరో ఉద్దేశ్యం కూడా వున్నది. సత్యారాధకుడు ఎంతవరకు సత్యారాధన చేయగలడో తెలుసుకోవాలనేది కూడా ఒక ఉద్దేశ్యం. స్వతంత్రతా దేవిని ఉపాసించే వాడిని. ఆ దేవి ఎంత బలిదానం కోరుతుందో తెలియజేయడం మరో ఉద్దేశ్యం. ఆత్మ గౌరవాన్ని త్యజించివేసి, యితర పిల్లలకు అలభ్యమైన విద్యను నా పిల్లలకు గరపి, నేను తృప్తి పడియుంటే వారికి వాఙ్మయ జ్ఞానం బాగా కలిగించి యుండేవాణ్ణే. కాని స్వాతంత్ర్యాన్ని గురించి, ఆత్మాభిమానాన్ని గురించి ఈనాడు వారికి కలిగిన జ్ఞానం అప్పుడు కలిగి యుండేదికాదు. స్వాతంత్ర్యం గొప్పదా లేక పాండిత్యం గొప్పదా అని ఎవరైనా ప్రశ్నిస్తే పాండిత్యం కన్న స్వాతంత్ర్యమే వెయ్యి రెట్లు మిన్నయని అనకుండా ఎవరైనా ఉండగలరా?

1920వ సంవత్సరంలో యిప్పటి స్కూళ్లు, కాలేజీలు స్వాతంత్ర్యానికి ఘాతుకాలు గనుక వాటిని విడిచి పెట్టమని బాలురకు ఉద్భోదించాను. అక్షరజ్ఞానం కోసం బంధితులై, గులాములై పడియుండేకంటే, స్వాతంత్ర్యం కోసం నిరక్షరులై యుండి రాళ్లను పగులగొట్టి బ్రతకడం మేలని ఉద్ఘోషించాను. దీనివల్ల నా ఉద్దేశ్యం ఏమిటో అందరికీ బోధపడియుంటుందని భావిస్తున్నాను.

6. సేవా ప్రవృత్తి

నా వృత్తి బాగా సాగుతున్నది. కాని దానివల్ల నాకు సంతోషం కలగలేదు. జీవితాన్ని యింకా రుజూ మార్గాన నడిపించాలనే మధన నాలో ఎక్కువగా సాగింది

ఆ సమయంలో మా యింటికి ఒక కుష్టురోగి వచ్చాడు. అన్నం పెట్టి పంపి వేయడానికి మనస్సు అంగీకరించలేదు. అతణ్ణి ఒక గదిలో వుంచి పుండ్లు కడిగి శుభ్రం చేసి కట్లు కట్టాను. సేవ చేశాను.

అయితే ఆ విధంగా ఎక్కువ రోజులు చేయలేకపోయాను. ఎల్లప్పుడు అతణ్ణి యింట్లో వుంచుకోవడానికి శక్తి చాలలేదు. ఇచ్ఛా బలం చాలలేదు. అందువల్ల గిరిమిటియాల కోసం ప్రభుత్వం వారు పెట్టిన ఆసుపత్రికి అతణ్ణి పంపించివేశాను.