పుట:సత్యశోధన.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

181

అందలి శిక్ష దీక్షలు బాగుండనందున నా పిల్లల్ని అక్కడికి పంపదలుచుకోలేదు. గుజరాతీ భాషలో బోధన కావాలంటే ఎలా సాధ్యం? ఇంగ్లీషు భాషలో అయితే వీలు వున్నది. ఎంతో కష్టం మీద వచ్చీరాని అరవంలోగాని లేక హిందీలోగాని పిల్లల చదువుకు వీలున్నది. కానీ యీవిషయంలో ఎదురైన అభ్యంతరాల్ని తొలగించలేక పోయాను. పిల్లలకు నేను చదువు చెబుదామని ప్రయత్నించాను. కాని అది నియమంగా సాగలేదు. అనుకూలమైన గుజరాతీ ఉపాధ్యాయుడెవ్వడూ దొరకలేదు.

నాకేమీ తోచలేదు. “నా ఉద్దేశ్యాల ప్రకారం పిల్లలకు విద్యగరపే ఆంగ్ల భాషా బోధకుడు ఒకరు కావాలి” అని పత్రికల్లో ప్రకటన చేశాను. ఆ ఉపాధ్యాయుడు నియమబద్ధంగా పిల్లలకు పాఠం చెబుతాడనీ, తీరిక దొరికినప్పుడు నేను కొంత చెప్పవచ్చునని భావించాను. నెలకు ఏడు పౌండ్ల జీతంమీద ఒక ఆంగ్ల వనిత పాఠం చెప్పడానికి అంగీకరించింది. యీ విధంగా పిల్లల చదువు ప్రారంభమైంది.

నేను పిల్లలతో గుజరాతీలోనే మాట్లాడుతూ వుండేవాణ్ణి. దానితో వాళ్ళకు కొద్దిగా గుజరాతీ భాషతో పరిచయం ఏర్పడింది. వాళ్ళను వెంటనే ఇండియాకు పంపాలనే ఉద్దేశ్యం నాకు లేదు. చిన్నపిల్లల్ని తల్లి దండ్రులకు దూరంగా వుంచకూడదను విషయం అప్పటికే నాకు బోధపడింది. మంచి ఏర్పాట్లుగల గృహాల్లో పిల్లలకు విద్య అప్రయత్నంగా అబ్బినట్లు, హాస్టల్లో ఉంచి చదివిస్తే అబ్బదు. ఆ కారణం వల్ల వాళ్ళు చాలాకాలం నాదగ్గరే వున్నారు. నా మేనల్లుణ్ణి, పెద్దకుమారుణ్ణి కొన్ని నెలల పాటు ఇండియాలో వసతి గృహాలు కల స్కూళ్లకు పంపించాను. కాని వాళ్ళను వెంటనే అక్కడనుండి తిరిగి తీసుకువచ్చాను. ఈడు వచ్చాక మా పెద్ద కుమారుడు తనంతటతాను అహమ్మదాబాదు హైస్కూల్‌లో చదవ తలచి దక్షిణ - ఆఫ్రికా వదిలి వెళ్ళిపోయాడు. నా మేనల్లుడు నేను చెప్పే చదువుకు తృప్తిపడి నాదగ్గరే వున్నట్లు గుర్తు. దురదృష్టవశాత్తు అతడు కొన్నాళ్ళు జబ్బుపడి నడియౌవనంలోనే యీ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. మిగిలిన నా ముగ్గురు పిల్లలు బడికి వెళ్లలేదు. సత్యాగ్రహ సమయంలో నేను స్థాపించిన పాఠశాలలో మాత్రమే వాళ్ళు నియమబద్ధంగా కొంచెం చదువుకున్నారు.

నా ఈ ప్రయోగాలన్నీ అపూర్ణాలే. వారికి విద్య బోధించుటకు కావలసినంత సమయం నాకు దొరకలేదు. ఇంకా అనేక ఆటంకాల వల్ల వాళ్లకు అవసరమైనంత శిక్షణ నేను గరపలేకపోయాను. ఈ విషయంలో వారి అసంతృప్తికి నేను కొద్దో గొప్పో గురికాక తప్పలేదు. ఎప్పుడైనా వారి ఎదుట ఎవరైనా మేము బి.ఏ. మేము ఎం.ఏ అని చెబుతూ వుంటే మేము కనీసం మెట్రిక్యులేషన్ అయినా ప్యాసుకాలేకపోతిమే అను భావం నా పిల్లల ముఖాన కనబడుతూ వుంటుంది.