పుట:సత్యశోధన.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అతని మాటలు నా మనస్సుమీద కొంత పనిచేశాయి. ఈ విషయమై బాగా యోచించాను. నేను ఆత్మ చరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి ప్రయోగాలతో నిండి వుంది. వాటన్నింటిని లిపిబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతిపుట సత్యప్రయోగాలతో నిండి వుంటే నా యీ చరిత్ర నిర్దుష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలన్నింటిని ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది నాకు కలిగిన మోహమే కావచ్చు. నేను రాజకీయరంగంలో చేసిన ప్రయోగాలు భారతదేశానికి తెలుసు, నా దృష్టిలో వాటివిలువ స్వల్పమే. ఈ ప్రయోగాల వల్లనే నాకు “మహాత్మ” అను బిరుదు వచ్చింది. నా దృష్టిలో ఆ బిరుదుకు గల విలువ స్వల్పమే. ఆ బిరుదువల్ల అనేక పర్యాయాలు నాకు విచారం కూడా కలిగింది. ఆ బిరుదును తలుచుకొని ఉబ్బితబ్బిబ్బు అయిన క్షణం నా జీవితంలో ఒక్కటి కూడా వున్నట్లు గుర్తులేదు. రాజకీయరంగులో నాకు శక్తి చేకూర్చిన, నాకు మాత్రమే తెలిసిన నా ఆధ్యాత్మిక ప్రయోగాలను యితరులకు కూడా తెలపడం నాకు యిష్టం. అవి నిజంగా ఆధ్యాత్మికాలైతే ఆందు గర్వానికి తావులేదు. పెరిగితే వినమ్రత పెరగవచ్చు. నా గతజీవితాన్ని పరిశీలించి చూస్తే అందునాకు లఘుత్వమే గోచరిస్తుంది.

గత ముప్పది సంవత్సరాలనుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే. ఈశ్వర సాక్షాత్కారం కోసమే. మోక్షం కోసమే. నా రచనా వ్యాసాంగమంతా అందుకోసమే. రాజకీయరంగంలో నా ప్రవేశం కూడా అందు కోసమే. ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం. అందువల్ల నా ప్రయోగాలు నా వరకే పరిమితం కావు. కానేరవు. ఆ ప్రయోగాలను అందరికీ తెలిపినందువల్ల వాటి ఆధ్యాత్మికత తగ్గుతుందని నాకు అనిపించడంలేదు. అయితే ఆత్మకే తెలిసినట్టి, ఆత్మలోనే శాంతించునట్టి విషయాలు కొన్ని వుంటాయి. అట్టి విషయాలను వివరించడం నా శక్తికి మించినపని. నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు, అనగా నైతికాలు. ధర్మం అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో వుంటాయి. ఈ నా కథను తటస్థుడనై, అభిమానరహితుడనై వ్రాయగలిగితే సత్యాన్వేషణా మార్గాన పయనించి ప్రయోగాలుచేసేవారందరికీ కొంత సామగ్రి లభిస్తుందని నా విశ్వాసం.

XIX