పుట:సత్యశోధన.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

తుపాను

అందుకు ముఖ్య కారణం, యీ సంగ్రామానికి కేంద్రబిందువును నేనే. నామీద క్రింద తెలిసిన రెండు నేరాలు మోపారు.

  1. నేను భారతదేశంలో పర్యటించి నేటాలులోగల తెల్లవారిని అనుచితంగా నిందించాను
  2. నేను నేటాలును భారతీయులతో నింపివేయాలని చూస్తున్నాను. అందుకోసం కురలేండు, నాదరీ ఓడలనిండా ఎంతోమందిని తీసుకు వస్తున్నాను.

నాకు విషయం బోధపడింది. నావల్ల దాదా అబ్దుల్లా గారికి పెద్ద అపాయం కలుగనున్నదని స్పష్టంగా తేలిపోయింది. నేను ఒంటరిగా రాక నా భార్యను, పిల్లల్ని కూడా వెంట తీసుకొని వచ్చి వాళ్ళను ప్రమాదంలో పడవేశాను.

నిజానికి నేను నిర్దోషిని. నేను ఎవ్వరనీ నేటాలు రమ్మని ప్రోత్సహించలేదు. నాదరీయందలి యాత్రికుల్ని అప్పటివరకు నేను ఎరుగను. కురలేండు యందలి యిద్దరి ముగ్గురి పేర్లు తప్ప మిగతావారి పేర్లు కూడా నేను ఎరగను. నేటాలులో చెప్పిన మాటలే భారతదేశంలో కూడా చెప్పాను. అంతకంటే మించి ఒక్క మాట కూడా నేను అనలేదు. నేను చెప్పిన ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యం వున్నది.

ఏ సంస్కారానికి నేటాలు యందలి తెల్లవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఏ స్థాయిలో వారు వ్యవహరిస్తున్నారో ఆ వివరం తెలుసుకొన్న మీదట విచారం కలిగింది. దాన్ని గురించి బాగా యోచించాను. ఆ విషయం నలుగురి ముందు ప్రసంగించాను. మిగతా వారికి నా అభిప్రాయం తెలియకపోయినా, కెప్టెన్‌గారికీ, తదితరులకు నా అభిప్రాయం బోధపడింది. అందువల్ల వారి జీవితంలో ఏమైనా మార్పు కలిగిందో లేదో తెలియదు. ఆ తరువాత తెల్లవారి సంస్కారాల్ని గురించి కెప్టెను మొదలగు వారితో చాలా సేపు చర్చ జరిగింది. నేను పాశ్చాత్య సంస్కారం హింసాపూరితం అని చెప్పాను. నా మాటలకు తెల్లవారు కొందరు ఆవేశపడ్డారు కూడా.

“తెల్లవారి బెదిరింపులు కార్యరూపం దాలిస్తే మీరు అహింసా సిద్ధాంతాన్ని ఎలా అనుసరిస్తారు” అని కెప్టెను ప్రశ్నించాడు. “వీరిని క్షమించుటకు, వీరిపై చర్చ గైకొనకుండుటకు అవసరమైన శక్తిని పరమేశ్వరుడు నాకు ప్రసాదించుననే ఆశ నాకున్నది. ఇప్పటికీ వీరి మీద నాకు రోషం లేదు. వారి అజ్ఞానం, వారి సంకుచిత దృష్టి చూస్తే నాకు జాలి కలుగుతున్నది. తాము చేస్తున్నదంతా సముచితమే అని వారు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందువల్ల కోపం తెచ్చుకునేందుకు కారణం