పుట:సత్యశోధన.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

171

అబ్దుల్ కరీం హాజీ ఆదం గారు కంపెనీ తరఫున వ్యవహర్తలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఓడలను రేవుకు చేర్చి యాత్రికులనందరినీ దింపి తీరతానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఏనాటికానాడు జరుగుతున్న వ్యవహారాలను ఆయన పూసగుచ్చినట్లు నాకు తెలియచేస్తూ వున్నాడు. కీర్తి శేషులు మన సుఖలాల్ హీరాలాల్ నాజరుగారు నన్ను చూచేందుకు అదృష్టవశాత్తు డర్బను విచ్చేశారు. వారు చాలా చతురులు, వీరులు కూడా. జనం వారి సలహాలను పాటిస్తూవుంటారు, వారి వకీలు మిస్టర్ లాటిన్. వారుకూడా అంతటి వారే. వారు తెల్లవారి చేష్టల్ని ఖండించారు. కేవలం డబ్బు పుచ్చుకునే వకీలువలె గాక నిజమైన మిత్రునివలె వారికి సహాయం చేస్తున్నారు

ఈ విధంగా డర్బనులో ద్వంద్వయుద్ధం ప్రారంభమైందన్నమాట. ఒకవంక కూటికి లేని నల్లవాళ్లు, మరొకవంక వీరికి మిత్రులైన కొందరు తెల్లవాళ్ళు వేరొకవంక ధనబలం, కండబలం, అక్షరబలం, సంఖ్యాబలం కలిగిన తెల్లవాళ్లు. అంతటి బలవంతులైన తెల్లవారికి ప్రభుత్వబలం కూడా తోడుగా వున్నది. నేటాలు ప్రభుత్వం వీరికి బహిరంగంగా తోడ్పడుతూ వున్నది. స్వయంగా హారీ ఎస్కాంబీగారు వారి సభలో పాల్గొని బహిరంగంగా వత్తాసు పలకడంతో వాళ్లు హద్దు దాటిపోయారు.

కావున మా క్వారంటీను కేవలం ఆరోగ్యానికి సంబంధించింది కాదని తేలిపోయింది. యాత్రీకుల్ని ఏజంటును భయపెట్టి ఏదో విధంగా ఓడల్ని తిరిగి, పంపివేయడమే వాళ్ల ముఖ్యోద్దేశం. “మీరు తిరిగి వెళ్ళిపోండి. లేకపోతే సముద్రంలో ముంచి వేస్తాం. తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ యిచ్చివేస్తాం” అని మమ్ము హెచ్చరించడం ప్రారంభించారు.

నేను యాత్రికుల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పసాగాను. నాదరీ ఓడయందలి యాత్రికులకు కూడా ధైర్యంగా వుండమని, భయపడవద్దని సమాచారం పంపించాను.

యాత్రీకుల వినోదం కోసం ఓడల్లో రకరకాల ఆటలు ఏర్పాటు చేశాం. క్రిస్‌మస్ పండుగ కూడా వచ్చింది. కెప్టెను యాత్రికులందరికీ డిన్నరు యిచ్చాడు. అందు మేము, మా పిల్లలం ముఖ్యులం. భోజనాశాల తరువాత ఉపన్యాసాలు సాగాయి. నేను పాశ్చాత్య నాగరికతను గురించి ప్రసంగించాను. అది గంభీరోపన్యాసానికి తగిన సమయం కాదని నాకు తెలుసు. కాని మరో విధంగా ప్రసంగించడం నా వల్లకాని పని. నేను వినోదంగాను, ప్రమోదంగాను మాట్లాడాను. కాని నా మనస్సంతా డర్బనులో జరుగుతున్న సంగ్రామం మీద కేంద్రీకరించి యున్నది.