పుట:సత్యశోధన.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన

నాలుగు లేక అయిదు సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వల్ల నేను ఆత్మకథ వ్రాయుటకు అంగీకరించాను. వ్రాయటం ప్రారంభించి ఒక ఫుల్ స్కేప్ పేజీ పూర్తి చేశానో లేదో ఇంతలో బొంబాయిలో రగడ ప్రారంభమైంది. దానితో నా ఆత్మకధ ఆగిపోయింది. తరువాత పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి యరవాడ జైల్లో నాకు సమయం దొరికింది. జయదాస్ రామ్ భాయి కూడా అక్కడ వున్నారు. మిగతా పనులన్నీ ఆపి ఆత్మకధ పూర్తి చేయమని ఆయన నన్ను కోరారు. అప్పటికే నా నిత్యకార్యక్రమాలు నిర్ణయమైపోయాయి. అట్టి స్థితిలో ఆత్మకధ వ్రాయడం కుదరదని చెప్పాను. అయితే శిక్షాకాలం పూర్తి అయ్యేంతవరకు యరవాడ జైల్లో వుండే అవకాశం లభిస్తే మాత్రం ఆత్మకధ వ్రాయవచ్చని అనుకున్నాను. అందుకు యింకా ఒక సంవత్సరం మిగిలివుంది. అంతకు పూర్వం ప్రారంభించిన ఆత్మకథ ముందుకు సాగలేదు. ఆరంభించగానే ఆగిపోయింది. ఇప్పుడు స్వామి ఆనంద్ ఆత్మకథ వ్రాయడం తిరిగి ప్రారంభించమని కోరారు. ఈలోపున నేను దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర పూర్తిచేశాను. అందువల్ల యిక ఆత్మకధ ప్రారంభించవచ్చునని భావించాను. నేను ఆత్మకధను త్వరగా వ్రాసి గ్రంధరూపంలో ప్రకటించాలని స్వామి ఆనంద్ కోరిక. అయితే త్వరగా వ్రాయడానికి అవసరమైన సమయం నా వద్ద లేదు. అందుకు ఒకటే మార్గం. నవజీవన్ పత్రికకు ఏదో కొంత వ్రాయక తప్పడం లేదు. అట్టి స్థితిలో నవజీవన్ కోసం ఆత్మకధనే వ్రాయవచ్చు కదా అని అభిప్రాయపడ్డాను. స్వామి ఆనంద్ నా అభిప్రాయాన్ని అంగీకరించారు. ఇక ఆత్మకధ వ్రాయడం ప్రారంభించాను.

ఆనాడు సోమవారం. నాకు మౌనదినం. ఒక మంచి మనస్సుగల అనుచరుడు నా దగ్గరకు వచ్చాడు. ‘మీరు ఆత్మకథ వ్రాయాలని ఎందుకు అనుకుంటున్నారు? యిది పాశ్చాత్య విధానం. ప్రాచ్య దేశాల్లో ఎవరూ ఆత్మకథ వ్రాసినట్లు కనబడదు. అయినా మీరు ఏం వ్రాస్తారు? ఈనాడు మీరు అంగీకరిస్తున్న సిద్ధాంతాన్ని రేపు అంగీకరించక పోవచ్చుకదా! ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు మార్పు చేయాల్సి వస్తే? మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ ఆచరణను రూపొందించుకొంటారు గదా! వాళ్ళు తప్పుదోవనపడితే! అందువల్ల మీరు ఆత్మకథ వ్రాయకుండా వుండటం మంచిదేమో కొంచెం ఆలోచించండి’ అని అన్నాడు.

XVIII