పుట:సత్యశోధన.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

పూనాలో

పయనించవచ్చు. బడిలో చేర్చుకునేప్పుడు పిల్లవాణ్ణి పరీక్షించినట్లు గోఖలేగారు నన్ను పట్టి పట్టి పరీక్షించారు. ఎవరెవరి దర్శనం చేయాలో, ఎట్లా చేయాలో వివరంగా చెప్పారు. నా ఉపన్యాసం ఒకసారి చూస్తానని అన్నారు. కాలేజీ అంతా చూపించారు. “మీరు యిష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను కలవండి. ప్రొఫెసరు భండార్కరు గారిని కలసిన తరువాత ఏమైందో నాకు చెప్పండి అని సెలవిచ్చారు. గోఖలేగారు జీవించియున్నంత కాలం రాజనీతి విషయాల్లో నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించారు. కన్నుమూసిన తరువాత కూడా వారు ఆ విధంగా నా హృదయాన్ని ఆక్రమించేవున్నారు. మరెవ్వరూ ఇంతగా నా హృదయాన్ని ఆక్రమించలేదు. కుమారుణ్ణి తండ్రి ఏవిధంగా ఆదరిస్తాడో ఆవిధంగా ప్రొఫెసర్ భండార్కరు గారు నన్ను ఆదరించారు. రెండు జాములప్పుడు నేను వెళ్లి వారిని కలిశాను. శాస్త్రాలలో పరిశ్రమ చేసిన ఆ పండితునికి నేను ఆ సమయంలో కూడా పని చేయడం ఆనందం కలిగించింది. తటస్థుడైన సభాధ్యక్షుడు కావలయునను నా పట్టుదలను విని అది మంచిది మంచిది అను మాటలు వారి నోట సహజంగా వెలువడ్డాయి.

నా మాటలు పూర్తి అయ్యాక వారు యిట్లా అన్నారు. “నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం లేదని ఎవర్ని అడిగినా చెబుతారు. కాని మిమ్మల్ని విముఖుణ్ణి చేయలేను. మీ వాదం న్యాయమైనది. మీ ఉద్యమం స్తుత్యం. మీ సభకు నేను రాను అని అనలేను. శ్రీయుతులు తిలక్‌గారిని, గోఖలే గారిని దర్శించారు. మంచిపని చేశారు. ఈ యిరుపక్షాలవారూ నన్ను ఆహ్వానిస్తే వస్తాను. సమయ నిర్ణయానికి నన్ను అడగవలసిన పని లేదు. వారికెప్పుడు అనుకూలమో నాకు అప్పుడే అనుకూలం. మీకు ధన్యవాదాలు, ఆశీర్వాదాలు”

చడీచప్పుడు గాకుండా ఆడంబరం లేకుండా ఆ విద్వాంసులు, ఆ మహాత్యాగులు సభ జరిపి నన్ను ప్రోత్సహించి పంపారు.

నేనక్కడి నుండి మద్రాసు వెళ్లాను. మద్రాసు ప్రజలు నా రాక విషయం తెలిసి ఎంతో సంతోషించారు. బాల సుందరం కథ సభను ఆకట్టుకుంది. నా ఉపన్యాసం పెద్దదైంది. అంతా ముద్రిత ఉపన్యాసమే. సభ ఒక్కొక్క శబ్దాన్ని మనస్సుకు పట్టించుకొని విన్నది. సభ ముగిసిన తరువాత పచ్చ పుస్తకం కోసం జనం ఎగబడ్డారు. మద్రాసులో అవసరం అవుతుందని భావించి కొన్ని మార్పులు చేసి మరో 10 వేల ప్రతులు ముద్రింపచేశాను. అవన్నీ వేడి వేడి రొట్టెల్లా అమ్మకం అయ్యాయి. పదివేల ప్రతులు అవసరం లేదనిపించింది. ప్రజల ఉత్సాహం మీదనే నేను ఎక్కువగా ఆధారపడ్డాను. నా ఉపన్యాసం ఇంగ్లీషు వచ్చిన వారికోసం గదా! వారికిన్ని ప్రతులు అక్కరలేదని నా అభిప్రాయం.