పుట:సత్యశోధన.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

163

గ్రహించాను. కాని నేను దక్షిణ - ఆఫ్రికా ఉద్యమం మానుకోవడానికి బదులు మరికొంచెం ఉధృతం చేశాను. ఏ దేశభక్తుడూ దేశసేవలో ఏ దేశాన్ని మరువలేడు కనుకనే నాకు క్రింది గీతాశ్లోకం సదా జ్ఞాపకం వస్తూ వుండేది.

"శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
 స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః"
                                              (గీత. 3వ అధ్యాయం 35 వ శ్లోకం)

“పరధర్మాన్ని అనుష్టించడం కంటే గుణములేనిదైనను స్వధర్మాన్నే అనుష్టించడం మంచిది. స్వధర్మం నిర్వహిస్తూ చచ్చినా మేలే, పరధర్మం భయావహం”

28. పూనాలో

సర్ ఫిరోజ్‌షా మెహతా గారు నా పనిని సులభం చేశారు. బొంబాయి నుండి నేను పూనా వెళ్లాను. పూనాలో రెండు పక్షాలున్నాయని నాకు తెలుసు. నాకు అన్ని పక్షాలవారి సాయం అవసరం. లోకమాన్యుని దర్శించాను. “అన్ని పక్షాల సాయం కావాలని నీవు భావించడం మంచిది. ఈ విషయంలో ఎవ్వరికీ అభిప్రాయ భేదం వుండదు. కాని యిందుకు సభాపతిగా తటస్థుడు కావాలి. మీరు ప్రొఫెసర్ భండార్కరు గారిని దర్శించండి. వారు యిప్పుడు సభలకు రావడం మానుకున్నారు. ఏ సభలకూ రావడం లేదు. కాని మీ సభకు అంగీకరిస్తారని భావిస్తున్నాను. వారిని కలిసాక పర్యవసానం ఏమైందో నాకు తెలుపండి. నేను సంపూర్తిగా మీకు సాయం చేయాలని కోరుతున్నాను. మీరు ప్రొఫెసరు గోఖలేగారి దర్శనం చేయండి. నన్ను చూడటం అవసరం అయితే మీకు వీలు అయినప్పుడల్లా తప్పక వచ్చి నన్ను కలవండి” అని లోకమాన్యుడు అన్నారు. లోకమాన్యుని చూడటం నాకు అదే ప్రథమం. వారు యింత లోకప్రియులెట్లా అయినారో అప్పుడు నాకు తెలిసింది.

అక్కడ నుండి నేను గోఖలేగారి దగ్గరకి వెళ్లాను. వారు పెర్గుజన్ కాలేజీలో పున్నారు. నన్ను అమిత ఆప్యాయంగా చూచారు. ఆత్మీయుణ్ణి చేసుకున్నారు. వారితో పరిచయం కూడా ప్రథమ పర్యాయమే. నాకు ప్రధమ పర్యాయమే పరిచయం ఆయినా అది ప్రథమ పరిచయం అనిపించలేదు. ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లు అనిపించింది. సర్‌ఫిరోజ్‌షా మెహతాగారు హిమాలయం, లోకమాన్యుడు సముద్రం, గోఖలే గంగ. ఇందు స్నానం చేయడం సులభం. హిమాలయంపై ఎక్కడం కష్టం. సముద్రంలో దిగాలంటే భయం కాని గంగ ఒడిలో ఆడుకోవచ్చు. దానిలో నావమీద