పుట:సత్యశోధన.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

బొంబాయిలో

ఈ సందర్భంలో సేస్తన్‌జీ పాదుషాగారు నాకు బాగా గుర్తు వస్తున్నారు. నేను ఇంగ్లాండులో వున్నప్పటి నుండి మా యిద్దరికీ స్నేహం. మేము మొదట లండనులో ఒక శాకాహారశాలలో కలుసుకున్నాము. యితని తమ్ముడు బరజో-రజీపాదుషా గారిని నేను ఎరుగుదును. అతనికి వెర్రివాడని పేరు వచ్చింది. మేమెన్నడూ ఒకచోట ఉండలేదు. మిత్రులు అతనికి చక్రం (నిలకడలేక గిర్రున తిరిగే చక్రం వంటి వాడు) అని పేరు పెట్టారు. గుర్రాల బగ్గీ ఎక్కడం తప్పని భావించి ఇతడు ట్రాము బండి ఎక్కడం కూడా మానుకున్న రకం. శతావధానికి అవసరమైన ధారణాశక్తి వున్నప్పటికీ ఏ డిగ్రీ అతడు పుచ్చుకోలేదు. స్వయంకృషితో స్వాతంత్ర్యం అలవరచుకున్నాడు. పుట్టింది పారసీకుల్లోనైనా, పేరులేదు. ఇతని బుద్ధి వైభవం ప్రఖ్యాతం. ఇంగ్లాండులో కూడా ఇతనికి మంచి ప్రఖ్యాతి ఉండేది. మా ఇద్దరి మైత్రికి మూలకారణం శాకాహారమే. అతనితో బుద్ధి వైభవంలో పోటీ పడటం నా తరం కాదు.

అతని చిరునామా బొంబాయిలో వెతికి సంపాదించాను. పేస్తన్జీ హైకోర్టులో ఉద్యోగం చేస్తూ వున్నాడు. అప్పుడతడు పెద్ద గుజరాతీ నిఘంటువు తయారుచేస్తున్నాడు. దక్షిణ - ఆఫ్రికాలోని ఉద్యమానికి సహాయపడమని ఎంతో మందిని కోరాను. పేస్తవన్జీ పాదుషా తాను ఎట్టి సాయం చేయనని చెప్పడమేగాక, నీవు కూడ తిరిగి దక్షిణ ఆఫ్రికాకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాడు.

“నేను నీకు సాయం చేయలేను. నీవు తిరిగి దక్షిణ - ఆఫ్రికా వెళ్లడం మంచిది కాదని నా అభిప్రాయం. మనదేశంలో చేయవలసిన పని కరువైందా? మనం మాతృభాషకు చేయవలసిన పని తక్కువగా వున్నదా? నేనిప్పుడు విజ్ఞాన శాస్త్రానికి భాష వెతుకుతున్నాను. మనం చేయవలసింది ఎంతో వుంది. దాని ముందు దక్షిణ - ఆఫ్రికా వ్యవహారం ఎంత? లొడితెడు. దేశ దారిద్ర్యం చూడు. దక్షిణ ఆఫ్రికాలో భారతీయులు చిక్కుల పాలై వుండటం యదార్థమే, కాని నీ వంటివాడు దానికి బలి కావడం నాకు ఇష్టంలేదు. మనం స్వరాజ్యం సంపాదిద్దాం. అప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో వున్న భారతీయులకు తేలికగా సహాయపడవచ్చు. నిన్ను మార్చలేనని నాకు తెలుసు. కాని నీతోపాటు మరొకరిని తీసుకొనిపోవడం నాకు సమ్మతం కాదు” అని స్పష్టంగా చెప్పివేశాడు.

నాకీ ఉపదేశం రుచించలేదు. కాని యీ సంభాషణ వల్ల ఆయన యెడ నాకు ఆదరం పెరిగింది. అతని దేశప్రేమ మరియు భాషా ప్రేమను చూచి ముగ్దుడనయ్యాను. ఈ ప్రసంగం వల్ల మా మైత్రి యింకా సుదృఢమైంది. ఆయన ఉద్దేశ్యం నేను