పుట:సత్యశోధన.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

161

హాలులో సభ జరిగింది. ఫిరోజ్‌షా మెహతాగారి సభ జరిగితే నిలబడడానికి కూడా హాలులో చోటు దొరకదని విన్నాను. వారి ఉపన్యాసం అంటే విద్యార్థులు చెవి కోసుకుంటారు.

అంతమంది జనంతో కిటకిటలాడిన సభను చూడటం నాకు అదే మొదటిసారి. నా కంఠధ్వని ఎవ్వరికీ వినబడలేదు. భయపడుతూ భయపడుతూ కంఠం పెద్దది చేశాను. ఫిరోజ్‌షాగారు బిగ్గరగా, ఇంకా బిగ్గరగా అని అంటూ నన్ను మధ్య మధ్య ప్రోత్సహించారు. వారు ప్రోత్సహించిన కొద్దీ నా కంఠం కుంచించుకుపోసాగింది.

ఇంతలో నా పాత మిత్రుడు కేశవరావు దేశపాండే గారు వచ్చి ఆదుకున్నారు. నా ఉపన్యాసం వారి చేతుల్లో వుంచాను. అతని కంఠం సభకు సరిపోయే రకంగా లేదు. సభ్యులెవరు వింటారు? “వాచా, వాచా” అని కేకలు సభలో వినబడ్డాయి. అప్పుడు వాచాగారు లేచి దేశపాండేగారి చేతిలోని కాగితాలు తీసుకొని నా పని పూర్తిచేశారు. సభ నిశ్శబ్దం అయింది. శ్రోతలు చివరివరకు శ్రద్ధగా విన్నారు. విషయాన్ని బట్టి ‘సిగ్గు, సిగ్గు’ అని అరిచారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నాడు ఎంతో సంతోషం కలిగింది.

సర్‌ఫిరోజ్‌షా మెహతాగారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించారు. నాకు గంగాస్నానం చేసినట్లనిపించింది. దేశ పాండేగారు, మరో పారసీ గృహస్తుడు నాకు పూర్తిగా సాయం చేయటానికి సిద్ధపడ్డారు. ఆ పారసీ మిత్రుడు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. అందువల్ల ఆయన పేరు వ్రాయడానికి జంకుతున్నాను. యీ యిద్దరూ దక్షిణ - ఆఫ్రికాకు వస్తామని మాట యిచ్చారు. కాని అప్పుడు స్మాల్ కాజ్ కోర్టు జడ్జియగు సి.ఎం ఖర్‌సేర్‌జీ వీరి మాటల్ని బూటకం చేశారు. దీనికి కారణం ఒక పారసీ మహిళ. అతడు ఆమెను పెండ్లి చేసుకోవడమే మంచిదని భావించాడు. యీ మిత్రుని వాగ్దాన భంగానికి నేటాలులోని పారసీ రుస్తుంజీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. యిప్పుడు అనేకమంది పారసీ మహిళలు ఖద్దరు ప్రచారానికి పూనుకొని ఆ పారసీకుని దోషానికి తాము ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నేనా దంపతుల్ని సంతోషంతో అభినందించాను. యిక దేశపాండే గారికి పెండ్లి ఆశలేదు. కాని అతడు కూడా రాలేకపోయాడు. నేడు అతడు కూడా అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు.

నేను దక్షిణ - ఆఫ్రికాకు బయలుదేరినప్పుడు జింజాబిరులో ఒక తైయబ్జీ వంశజుడు కనబడ్డాడు. అతడు కూడా నాకు సాయపడతానని అన్నాడు. కాని అలా చేయలేదు. అందుకు అబ్బాస్ తైయబ్జీగారు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. యీ విధంగా బారిస్టరు మిత్రులను దక్షిణ - ఆఫ్రికాకు తీసుకొని వెళ్లాలని నేను చేసిన మూడు ప్రయత్నాలు ఫలించలేదు.