పుట:సత్యశోధన.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

159

నేను వారి దగ్గరికి వెళ్లి వారిని కలిశాను. వారిని చూచేసరికి కళ్లు మిరిమిట్లుగొన్నంత పని అయింది. వారి పేరుతో బాటు ప్రచారంలో వున్న బిరుదులు చాలా విన్నాను. బొంబాయి కేసరి అని, మకుటంలేని బొంబాయి పాదుషా అని బిరుదులు వారికి పున్నాయి. కాని బొంబాయి పాదుషా అనుకున్నంత భయంకరంగా లేడు. పితృవాత్సల్య భావంతో ఎదిగిన కుమారుణ్ణి ఆదరించినట్లు ఆయన నన్ను ఆదరించాడు. మేమిద్దరం వారి గదిలో కూర్చున్నాం. మిత్రులు, అనుయాయులు ఆయన చుట్టూ ఉన్నారు. వారిలో డి ఇ వాచాగారొకరు. కామాగారు మరింకొకరు. ఆ యిద్దరికీ నేను పరిచయం చేయబడ్డాను. లోగడ వాచాగారిని గూర్చి విని వున్నాను. అతడు మెహతాగారికి కుడిభుజం. ఆయన లెక్కల్లో గట్టివాడని వీరచంద్ గాంధీ చెప్పారు. మనిద్దరం కలిసి మాట్లాడాలి అని వాచాగారన్నారు.

రెండు నిమిషాల్లో యిదంతా జరిగింది. మెహతాగారు నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. నేను రనడే గారిని, తైయబ్జీగారిని చూచానని వారికి చెప్పాను. “గాంధీ! ముందుగా ఒక పని జరగాలి. నీ పనికి నేను తప్పక సహాయం చేస్తాను” అని మెహతాగారు వెంటనే తన కార్యదర్శి మున్షీగారిని పిలిచి సభాదినం నిర్ణయించమని అన్నారు. సభాదినం నిశ్చితమైంది “సభ రేపు జరుగుతుందనగా నీవు నాకొక్కసారి కనపడు” అని మెహతాగారు నన్ను పంపివేశారు. వారి సంభాషణ విన్న తరువాత నాకు భయం పోయింది. సంతోషంతో ఇంటికి చేరాను.

మా బావ బొంబాయిలోనే వున్నాడు. ఆయనను చూచేందుకు వెళ్లాను. ఆయన జబ్బుపడి వున్నాడు. బీదవాడు. నా సోదరి వల్ల ఆయనకు ఉపచారం జరగడం కష్టంగా వుంది. నాతో రాజకోటకు రమ్మని అన్నాను. అతడు అంగీకరిచాడు. నా సోదరిని, బావను తీసుకొని రాజకోట చేరాను. వ్యాధి ఎక్కువైంది. రాత్రింబవళ్ళు ఆయనకు ఉపచారం చేశాను. రాత్రిళ్లు మేలుకొని వుండవలసి వచ్చింది. ఆయనకు ఉపచారం చేస్తూనే దక్షిణ ఆఫ్రికాను గురించి వ్రాస్తూ వున్నాను. చివరికి ఆయన కన్నుమూశాడు. తుదికాలంలో ఆయనకు ఉపచారం చేసే అవకాశం లభించినందున నా మనస్సుకు శాంతి లభించింది.

ఈ విధంగా రోగులకు ఉపకరించాలనే కోరిక ముందు ముందు బాగా ఎక్కువైంది. రోగుల సేవలో వున్నప్పుడు నా మిగతా పనుల విషయంలో జాగ్రత్తపడుతూ వుండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు నా భార్యనేగాక యింటివారందరినీ ఆ పనులకు వినియోగిస్తూ వుండేవాణ్ణి.