పుట:సత్యశోధన.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

రాజభక్తి

మా పిల్లలకు కూడా గాడ్ సేవ్ ది కింగ్ అను పాటను నేర్పాను. రాజకోట యందలి ట్రైనింగ్ కళాశాల విద్యార్థులకు కూడా యీ పాట నేర్పినట్లు గుర్తు. కాని అది జూబిలీలోనో లేక ఎడ్వర్డు పట్టాభిషేక సమయంలోనో సరిగా చెప్పలేను. కాని తరువాత ఆ పాటను నేను వ్యతిరేకించాను. నా మనస్సునందు ఆ హింసను గురించి చర్చ అధికమైన కొద్దీ నేను జాగ్రత్తపడ్డాను.

“రాజ శతృవులను చంపుము ఆ మోసగాండ్ర మోసాలను ద్రుంపుము” అను పాటయందలి వాక్యాలు నాకు గిట్టలేదు. నా మిత్రుడు డాక్టరు బూధ్ గారికి నాయీ సంశయం తెలియజేశాను. ఆయన కూడా అంగీకరించి అహింసావాది ఎవ్వరూ ఇందుకు అంగీకరించరని, అట్టివారు దీన్ని పాడటం కష్టమని అన్నారు. ఈ పాటలో శతృవులని ఊహించబడిన వారు మోసగాండ్రని ఎలా అనగలం? శతృవులైనంత మాత్రాన తప్పంతా వారిదేనా? పరమేశ్వరుని వద్ద మనకు న్యాయం లభించును కదా! డాక్టరు బూధుగారు నా వాదాన్ని సమర్ధించడమే గాక వారి సమాజంలో ఈ పాటకు బదులు మరో పాటను రచించి గానం చేయసాగాడు.

రాజభక్తితో బాటు రోగులకు ఉపచారం చేయడం నాకు అలవాటు అయిపోయింది. మిత్రులైనా, పరులెవరైనా వారికి ఉపయోగపడటమంటే నాకు ఎంతో ప్రీతి.

రాజకోటలో దక్షిణ - ఆఫ్రికాను గురించి కరపత్రం వ్రాస్తున్నప్పుడు నేను ఒక పర్యాయం బొంబాయి వెళ్లవలసి వచ్చింది. పెద్ద పెద్ద పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి యీ విషయమై ప్రజాభిప్రాయం సేకరించాలని నా అభిలాష. అందుకు ముందుగా బొంబాయిని ఎన్నుకొన్నాను. జడ్జీ రేవడేగారిని కలసి మాట్లాడాను. నేను చెప్పిందంతా విని, చివరికి ఫిరోజ్‌షా మెహతాగారిని చూడమని చెప్పారు.

తరువాత జడ్జీ బదురుద్దీన్ తైయబ్జిగారిని చూచాను. వారు కూడా అదే విధంగా చెప్పి “రేనడేగారు, నేనూ ఏమీ చేయలేము. మాస్థితి నీకు తెలుసు. ప్రజా వ్యవహారాల్లో మేము కల్పించుకోకూడదు. నీ పనికి మేము అనుకూలురం. యీ విషయంలో నీకు సాయం చేయగల వారు ఫిరోజ్ షా మెహతాగారొక్కరే” అని చెప్పారు.

నేను ఫిరోజ్ షా మెహతా గారి దర్శనం చేసుకోవాలని మొదటనే భావించాను. ఈ పెద్దలు వారి సాయం పొందమని చెప్పడం వల్ల ప్రజల్లో వారికి ఎంత పలుకుబడి వున్నదో బోధపడింది.