పుట:సత్యశోధన.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

157



26. రాజభక్తి

నాకు రాజభక్తి అధికం. అంతటి రాజభక్తి మరొకరికి వుందని నేను అనుకోను. సత్యం మీద నాకు గల స్వాభావికమగు ప్రేమయే యిట్టి రాజభక్తికి కారణమని భావిస్తున్నాను. ఇట్టి రాజభక్తి విషయంలోగాని, మరే విషయంలో గాని నటన అనునది నాకు చేతకాదు. నేటాలులో నేను పాల్గొనే ప్రతి సభలోను జనం గాడ్ సేఫ్ ది కింగ్ అను పాట పాడి వెళ్లిపోతూ వుండేవారు. వారితో కలిపి పాడటం నా విధియని భావించేవాణ్ణి. బ్రిటిష్ పరిపాలనా దోషాలు నాకు తెలుసు. బ్రిటీష్ పరిపాలకుల యొక్క నీతి మొత్తం మీద మేలైనదని భావించేవాణ్ణి.

దక్షిణ - ఆఫ్రికాలో గల వర్ణద్వేషం బ్రిటీష్ వారి సంప్రదాయం కాదని నా భావం. అందువల్ల రాజభక్తిలో తెల్లవారిని కూడా మించిపోయాను. గాడ్ సేవ్ ది కింగ్ అను పాట కూడా నేర్చుకున్నాను. అందరూ లేచిపాడుతూ వున్నప్పుడు నేను కూడా లేచి నిలబడి ఆ పాట పాడుతూ వుండేవాణ్ణి. రాజభక్తి అవసరమని ప్రతి సమయంలోను నేను స్పష్టంగా ప్రకటిస్తూ వున్నాను.

జీవితంలో నేను ఎన్నడూ నా రాజభక్తిని అమ్ముకోలేదు. దాని ద్వారా ఎన్నడూ స్వప్రయోజనం సాధించాలని భావించలేదు. రాజభక్తి ఒక విధియని భావించాను. దానివల్ల ప్రతిఫలం నేనెన్నడూ ఆశించలేదు. పొందలేదు. నేను ఇండియాకు వచ్చిన రోజుల్లో విక్టోరియా రాణి “డైమండ్ జూబ్లీ” మహోత్సవం ఆరంభమైంది. రాజకోటలో ఏర్పాటుచేయబడ్డ ఒక సంఘంలో చేరమని నాకు పిలుపు వచ్చింది. నేను అంగీకరించాను. ఆ ఉత్సవం కూడా పైన పటారం లోన లొటారమే. అంతా మోసం. చాలా బాధపడ్డాను. ఆ సంఘంలో సభ్యునిగా వుండటమా, మానడమా అను ప్రశ్న బయలుదేరింది. చివరికి యోచించి యోచించి ‘పనిలో మాత్రం సత్యంగా వ్యవహరిద్దాం’ అను నిర్ణయానికి వచ్చాను.

ఆ ఉత్సవాల్లో చెట్లు నాటటం ఒక కార్యక్రమం. చాలా మంది డాబు కోసం, పై అధికారుల మెప్పుకోసం, మొక్కలు నాటుతూ వున్నారని తెలిసింది. చెట్లు నాటడం ఒక విధి కాదు, అందువల్ల దీనికి బదులు మరో కార్యక్రమం చేపట్టమని వారికి మరీ మరీ చెప్పి చూచాను. కాని వాళ్ళు నా మాటను పట్టించుకోలేదు. నా పాలబడిన మొక్కను మాత్రం జాగ్రత్తగా నాటి, నీరు పోసి పెంచినట్లు గుర్తు.