పుట:సత్యశోధన.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

హిందూ దేశంలో

యుండరన్నంత పని అయింది. మాలవాడకు వెళ్లడం నాకు అదే మొదలు. వాళ్ల యిళ్లు చూచి నేను నివ్వెరబోయాను. వాళ్లు కూడా మమ్మల్ని చూచి ఆశ్చర్యంతో చకితులైనారు. మీ పాకీ దొడ్లు చూచేందుకు వచ్చాం అని నేను అన్నాను. “మాకేమిటి పాకీ దొడ్లేమిటి. మేము బయటకి పోతాం. మీ వంటి గొప్పవారికేనండీ పాకీ దొడ్లు” అని వాళ్లన్నారు. “మేము మీ ఇల్లు చూడవచ్చునా?” “అయ్యా. తప్పక చూడవచ్చు. అడ్డులేదు. మీకిష్టమొచ్చిన చోట చూడండి. అయ్యా, మా ఇళ్లా? యివన్నీ బొరియలండీ బొరియలు” అని అన్నారు.

నేమ లోపలికి వెళ్లి వాళ్ల యిళ్లు ముంగిళ్లు చూచాను. ఇళ్లు ఆవు పేడతో అలికి వున్నాయి. కుండలు, చట్లు అన్నీ శుభ్రంగా వుండి నిగనిగలాడుతూ వున్నాయి. ఈ ప్రదేశంలో ప్లేగు భయం లేదు. ఇక గొప్పవారి పాకీ దొడ్లను గురించి వర్ణించడం అవసరం. అది ఒక భాగ్యశాలిది. ప్రతి గదికి తూములు వున్నాయి. వీటి తూములు, మూత్రపు తూములు కూడా అవే. అందువల్ల దుర్గంధం అపరిమితంగా ఉన్నది. ఇంట్లో మేడ మీద పడక గది వుంది. దానికి ఒక తూము వుంది. మల మూత్రాలకు అది ఒక్కటే మార్గం. ఆ తూము నుండి నేలకు ఒక గొట్టం అమర్చబడింది. ఇక్కడ నిలబడితే ముక్కు పగిలిపోవలసిందే. ఆ యింట్లో వాళ్లు అక్కడ ఎలా వుంటున్నారో ఎలా నిద్రిస్తున్నారో పాఠకులే ఊహించుకొందురుగాక.

మా బృందంవారు వైష్ణవాలయం కూడా చూచేందుకు వెళ్ళారు. అక్కడి పెద్ద పూజారికి, గాంధీ కుటుంబానికి చాలా కాలం నుండి స్నేహ సంబంధాలు వున్నాయి. దేవాలయమంతా చూపించడానికి, సంస్కరణల్ని అమలుపరచడానికి ఆయన అంగీకరించాడు. ఆ దేవళంలో ఆయన కూడా ఎన్నడూ చూడని ఒక చోటు మా కంటబడింది. పుల్లాకులు, ఊడ్చిన పెంట అక్కడ పడవేస్తారు. కాకులకు, గ్రద్దలకు అది నిలయం. పాకీ దొడ్లు పాడుగా వున్నాయని చెప్పనక్కరలేదు. రాజకోటలో ఎంతోకాలం నేను వుండలేదు, అందువల్ల ఆయన దాన్ని ఎంత వరకు బాగుచేయించాడో నాకు తెలియదు.

దేవాలయంలో దుర్గంధం చూచి చాలా బాధపడ్డాను. దేవాలయం పవిత్రమైనదని మనం భావిస్తాం. అక్కడ ఆరోగ్య విధులు పాటింపబడాలని ఆశిస్తాం. స్మృతి కర్తలు బాహ్యాంభ్యంతర శుద్ధి అత్యావశ్యకమని ఎంతగానో ఉద్ఘోషించారు. ఆ విషయం సర్వులకు తెలియడం ఎంత అవసరమో అప్పుడు బోధపడింది.