పుట:సత్యశోధన.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

155

ఈ పుస్తకాలన్నింటికి కాగితాలు చుట్టి పోస్టులో పంపడం శ్రమతో కూడిన పని. ధనవ్యయం కూడా అధికం. అందుకు ఒక ఉపాయం కనిపెట్టాను. చుట్టుప్రక్కల గల పిల్లల్ని పిలిచాను. బడిలేని ప్రొద్దుటి పూట నాకు సాయం చేయమని వారిని కోరాను. వారు అంగీకరించారు. వారి శ్రమకు బదులుగా ముద్ర కొట్టిన తపాళా బిళ్లలు, ఆశీర్వాదాలు అందజేస్తానని చెప్పాను. పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ పని పూర్తిచేశారు. చిన్న చిన్న పిల్లల్ని స్వయం సేవకులుగా తయారుచేయడం నా జీవితంలో యిదే ప్రథమం. ఆనాటి బాలమిత్రులలో ఇద్దరు నాతోబాటు యిప్పటికీ పనిచేస్తున్నారు.

ఆ రోజుల్లో బొంబాయిలో విపరీతంగా ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఎటు చూచినా గగ్గోలే. రాజకోటలో కూడా యిది ప్రవేశించిందని భయం పట్టుకున్నది. ఆరోగ్య విషయంలో మంచి నిపుణుణ్ణి అని నా భావం. నేను స్వచ్ఛంద సేవ చేస్తానని తెలియజేశాను. ప్రభుత్వం వారు వెంటనే అంగీకరించి నన్ను రోగపరీక్షా సంఘంలో ఒక సభ్యునిగా నియమించారు. పాకీ దొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని నేను గట్టిగా చెప్పాను. బీదవాళ్ళు తమ పాకీ దొడ్లు పరీక్షించుటకు వ్యతిరేకంగా లేరు. మేము సూచించిన సంస్కరణలన్నింటినీ జనం అమలులోకి తెచ్చారు. యిక ధనవంతుల విషయం. మేము వారి దొడ్లు పరీక్షిస్తామంటే వాళ్లు అంగీకరించలేదు. యిక సంస్కరణలు ఎలా జరుగుతాయి? ధనికుల పాకీదొడ్లు పాడుగా వున్నాయని అనుభవంవల్ల తెలిసింది. అంతా చీకటిమయం. తేమ ఊరుతూ వుంటుంది. దుర్గంధం విపరీతం. కూర్చునే చోట లుకలుకలాడుతూ పురుగులు. జీవితంలో యిదే నరకం అని అనిపించింది. అమిత బాధ కలిగింది. మేము చెప్పిన సంస్కరణలు బహుసులభం. మలం నేల మీద పడకుండా బొక్కెనలు వుంచమని చెప్పాం. నేల మీద పడి తేమ పుట్టించకుండా మూత్రం మరో బొక్కెనలో నింపమని చెప్పాం. పాకీ దొడ్లకు బయటి గోడలకు మధ్యగల కట్టడాలను కూల్పించివేశాము. గాలి, వెలుగు పాకీ దొడ్లలోకి బాగా వచ్చేలా చేసి శుభ్రం చేసేందుకు పాకీ వారికి సౌలభ్యం కలిగించాం. అయితే చాలామంది ధనికులు చివరి సలహాను అంగీకరించలేదు. కొంతమంది ధనికులు అసలు సంస్కరణలు అమలు చేయుటకు సిద్ధ పడలేదు.

ఈ సంఘం మాల పల్లెలకు కూడా వెళ్లి వాళ్ల దొడ్లను చూడాలని నిర్ణయించింది. ఎవ్వరూ మావెంట రావటానికి సిద్ధం కాలేదు. ఒక్కడు మాత్రం నాతోబాటు రావడానికి అంగీకరించాడు. మాలపల్లెకు వెళ్లడం, అక్కడి పాకీదొడ్లు చూడటం అంటే అందరికీ ఒక విధమైన ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం ఎవ్వరూ కలలోనైనా ఊహించి