పుట:సత్యశోధన.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

హిందూ దేశంలో


యివాళ తప్పిపోయిందనీ, రేపు వెళ్లడం అవసరమనీ, అందువల్ల యీ రోజు అవకాశం యిస్తే తప్పక మీ దర్శనం చేసుకుంటానని ఆ చీటీలో వ్రాశాను. మంచిది రండి అని వెంటనే సమాధానం వచ్చింది. నాకు సంతోషం కలిగింది. ఆ ఆంగ్లేయుడు నా మాటలన్నీ విన్నాడు. “మీరు వ్రాసినదంతా చదివి నేను నా పత్రికలో టిప్పణి వ్రాస్తాను. అయితే మీ విధానాన్నంతటినీ నేనంగీకరించలేను. ఎందువల్లననగా నేటాలులోని భారతీయుల కోరికలను గురించి, అక్కడి తెల్లవారి అభిప్రాయాలను కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలిగదా!” అని అన్నాడు.

‘మీరు విషయాలన్నింటిని సంపూర్తిగా చదివి మీ పత్రికలో చర్చిస్తే చాలు. న్యాయం తప్ప నాకు మరొకటి అవసరం లేదు’ అని నేను అన్నాను. మిగిలిన సమయం త్రివేణీ సంగమ సౌందర్యం గురించి యోచించుటకు గడిచిపోయింది. పయోనీరు అధికారితో నా యీ ఆకస్మిక కలయికయే నేటాలు రాష్ట్రంలో నేను పడిన యాతనలకు బీజారోపణం చేసిందని తరువాత తెలిసింది.

అక్కడినుండి బొంబాయిలో దిగకుండా తిన్నగా రాజకోటకు వెళ్లాను. దక్షిణ - ఆఫ్రికాయందు నివసిస్తున్న భారతీయుల్ని గురించి ఒక చిన్న పుస్తకం వ్రాయాలని నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం వ్రాయడానికి, ప్రచురించడానికి ఒక మాసం పట్టింది. దాని పైన పచ్చరంగు అట్ట వుండటం వల్ల దానికి పచ్చ పుస్తకం అని పేరు వచ్చింది. అందు దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులన్నీ వర్ణించాను. కావాలని చాలా విషయాలు తగ్గించి వ్రాశాను. గతంలో వ్రాసి ప్రకటించిన రెండు కరపత్రాల కంటే యిందు సరళభాషను ఉపయోగించాను.

పదివేల ప్రతులు ప్రకటించాను. హిందూదేశంలోని అన్ని పత్రికలకు, అన్ని పక్షాల నాయకులకు పంపించాను. అందరికంటే ముందు పయోనీరు పత్రికాధిపతి తన సంపాదకీయ వ్యాసంలో దీన్ని గురించి చర్చించాడు. ఆ వ్యాస సారాంశం రూటరు ద్వారా ఇంగ్లాండు చేరింది. అక్కడ నుండి ఆ సారాంశానికి సారాంశం నేటాలు కూడా చేరింది. అందు మూడు పంక్తుల కంటే ఎక్కువలేదు. నేటాలులోని భారత ప్రజలు పడుతున్న భాధలను గురించి నేను వ్రాసిన వ్యాసానికి అది కొద్ది సంస్కరణ అన్నమాట. అందలి శబ్దాలు నావికావు. ఈ వార్త నేటాల్లో ఎంతపని చేసిందో తరువాత మీకు బోధ పడుతుంది. పేరున్న పత్రికలన్నింటిలో నా వ్యాసాన్ని గురించి టీకలు, టిప్పణీలు ప్రకటితమయ్యాయి.