పుట:సత్యశోధన.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

149

మంచివాడనని, ఎవరేం చెబితే అది నమ్ముతానని నాకు పేరు వచ్చింది. అట్టి నా యింట్లోనే దుర్గంధం వ్యాప్తి కావడం చూచి మా వంటవాడు ఆశ్చర్యపడిపోయాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు నా భోజనం. ఆఫీసు నుండి ఆ సమయానికి యింటికి వెళ్లడం నాకు అలవాటు.

ఒకనాడు పన్నెండుగంటల వేళ ఆ వంటవాడు ఆఫీసుకు రొప్పుకుంటూ వచ్చి “ఒక తొందర పని వుంది. మీరు వెంటనే యింటికి రావాలి” అని అన్నాడు “ఇప్పుడెట్లా? పనేమిటో చెప్పు. ఆఫీసు వదలి యింటికి రావలసిన అవసరం ఏం వచ్చిందో చెప్పు” అని అన్నాను.

“మీరిప్పుడు యింటికి రాకపోతే తరువాత ఎందుకు వెళ్లకపోతినా అని విచారపడతారు. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను”.

అతడంత గట్టిగా చెప్పేసరికి ఇంటికి బయలుదేరాను. వంటవాడు ముందు నడిచి నన్ను మేడ మీదకు తీసుకువెళ్లాడు. నా మిత్రుని గదిని చూపించి తలుపులు తెరచి మీరే చూడండి ఏం జరుగుతున్నదో అని అన్నాడు.

నాకు అంతా బోధపడిపోయింది. తలుపుతట్టాను. సమాధానం ఎలా వస్తుంది? గట్టిగా తలుపు మీద బాదాను. గోడలు కూడా కదలిపోయినంత పని అయింది. తలుపులు తెరచుకున్నాయి. లోపల ఒక వేశ్య. వెళ్లిపో యిక ఎప్పుడూ యీ గుమ్మం తొక్కవద్దు అని చెప్పి ఆమెను పంపించివేశాను.

“ఈ క్షణాన్నుండి నీతో నా కెట్టి సంబంధం లేదు. నేను బుద్ధి మాంద్యం వల్ల మోసపోయాను. నా విశ్వాసాన్ని యిలా పటాపంచలు చేశావు” అని అరిచాను. నాయీ మాటలకు పశ్చాత్తాప పడవలసిన మిత్రుడు తద్విరుద్ధంగా వ్యవహరించి చూడు! నీ రహస్యాలన్నీ బయట పెడతా అని బెదిరించాడు. “నాకు రహస్యమేమీ లేదు. నా సంగతంతా చాటిచెప్పు. నీవు తక్షణం ఇల్లు విడిచి వెళ్లిపో” అని గద్దించాను.

అతడు యింకా కొంచెం బిరుసెక్కాడు. అతణ్ణి సంబాళించడం కష్టమని భావించాను. క్రింద వున్న గుమాస్తాను పిలిచాను. నీవు వెంటనే పోలీసు సూపరింటెండెంటు గారి దగ్గరకి వెళ్లి నా నమస్కారం తెలియజేయి. నా యింట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి విశ్వాసఘాతుకం చేశాడు. అతడు నా యింట్లో వుండటం నాకు యిష్టంలేదు. కాని అతడు యిక్కడి నుండి కదలడం లేదు. తమ మద్దతు కోరుతున్నాను అని నా ప్రార్ధనగా చెప్పు అని అన్నాను.