పుట:సత్యశోధన.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

ధర్మ నిరీక్షణ

ఈ పన్ను 25 పౌండ్ల నుండి అనగా 375 రూపాయల నుండి 3 పౌండ్లకు అనగా 45 రూపాయలకు తగ్గింపబడినా అది నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారికి గౌరవప్రదం కాదు! గిరిమిటియాలకు ఏమీ మేలు జరగలేదను విషయం స్పష్టం. అది నిర్వివాదాంశం. ఈ పన్నును రద్దు చేయించి ముదరా యిప్పించాలని కాంగ్రెసు వారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని వారు ఎన్నడూ విడిచి పెట్టలేదు. అయితే యీ నిర్ణయం నెరవేరడానికి ఇరవై సంవత్సరాల కాలం పట్టింది. ఒక్క నేటాలు నందలి భారతీయులేగాక దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులంతా కలిసి ఏకోన్ముఖంగా పెద్ద ఉద్యమం నడిపితేనే గాని ఆ పన్ను రద్దుకాలేదు. గోఖలే గారికి రద్దు చేస్తామని మాట యిచ్చి కూడా చివరికి నెరవేర్చక పోయేసరికి తుది సమరం ప్రారంభించవలసి వచ్చింది. ఆ సమరంలో గిరిమిటియాలంతా పూర్తిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వారు తుపాకులు కాల్చినందున చాలామంది గిరిమిటియా భారతీయులు ప్రాణాలు అర్పించారు. పదివేల మందికి పైగా నిర్బంధింపబడి జైళ్లకు వెళ్లారు.

అయితే చివరికి సత్యమే జయించింది. భారతీయుల బాధల రూపంలో సత్యం అక్కడ ప్రత్యక్షమైంది. అచంచలమైన ఓర్పు, నమ్మకం, విసుగు విరామం లేని పట్టుదల, పూనిక వల్ల ఆ యుద్ధంలో జయం లభించింది. లేకపోతే జయం లభించియుండేది కాదు. ఆ పోరాటం జరుపకుండా మానివేసివున్నా, లేక నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు ఆ విషయం మరిచిపోయినా తల పన్ను గిరిమిటియాల మీద పడియుండేదే. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయ గిరిమిటియాలు చెల్లిస్తూ వుండేవారే. ఆ అపయశస్సు దక్షిణ ఆఫ్రికా యందు నివసిస్తున్న భారతీయులకే గాక భారతదేశంలో నివసిస్తున్న సమస్త భారతీయులకు కూడా ఆపాదించి యండేది.

22. ధర్మ నిరీక్షణ

ఈ విధంగా నేను పూర్తిగా ప్రజా సేవలో లీనమైపోయాను. అందుకు కారణం ఆత్మ సాక్షాత్కారాభిలాషయే. ప్రజాసేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే విశ్వాసంతోనే నేను సేవా ధర్మాన్ని స్వీకరించాను. భారతసేవ నాకు సహజంగా లభించింది. నాకిది ఎంతో ఇష్టం. కోరుకోకుండా యిది నాకు లభ్యమైంది. నేను పర్యటనా కాంక్షతోను, కాఠియావాడులో జరుగుతున్న కుట్రల బారి నుండి తప్పించుకోవాలనే కోరికతోను జీవిక కోసం దక్షిణ ఆఫ్రికా చేరాను. కాని నేను యిక్కడి ప్రజాసేవలో లీనమై ఈశ్వరాన్వేషణ మరియు ఆత్మదర్శనమునందు నిమగ్నమై పోయాను.