పుట:సత్యశోధన.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

మూడు పౌండ్ల పన్ను

దొరకడం కష్టమైంది. ఆ దేశంలో కూలివాళ్లను రప్పించడం అవసరమని భావించారు. అందువల్ల నేటాలు ప్రభుత్వం వారు బ్రిటిష్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి భారత దేశాన్నుండి కూలివారిని వలస తీసుకొనిపోయేందుకు అనుమతి సంపాదించారు. ఈ కూలి జనం నేటాలులో అయిదేండ్లు పని చేయుటకు అంగీకరిస్తూ గిరిమిటు మీద (కరారునామా) సంతకం చేయాలి. గడువు దాటిన తరువాత వారి యిష్టం. అంటే అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు. శక్తి వుంటే భూమి కొనుక్కోవచ్చు. ఈ విధంగా తెల్లవాళ్లు గిరిమిటీలకు ఆశ పెట్టారు. అయిదు సంవత్సరాల తరువాత కూడా భారతదేశ కూలీలు కాయకష్టంచేసి ప్రయోజనం పొందవచ్చునని తెల్లవాళ్లు ప్రకటించారు.

అయితే భారతీయులు తెల్లవారనుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందారు. వారు రకరకాలైన కూరగాయలు విరివిగా పండించసాగారు. ఇండియా నుండి మంచి కూరగాయల విత్తనాలు వెంటతీసుకొని వెళ్లి తద్వారా బాగా కూరగాయలు పండించి అక్కడ చవుకగా జనానికి అందచేశారు. మామిడితోటలు పెంచారు. వర్తకం కూడా చేయడం ప్రారంభించారు. ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు కొన్నారు. కొందరు కూలీలు భూస్వాములైనారు. భారతదేశపు వర్తకులు కొందరు వీరితోబాటు వెళ్లి అచ్చట పాతుకుపోయారు. ఇట్టివారిలో కీ.శే, సేఠ్ అబుబకర్ అమద్ గారు ప్రధములు. వారు కొద్ది కాలంలోనే తమ వ్యాపారాన్ని వృద్ధికి తెచ్చారు.

ఇదంతా చూచి తెల్లవ్యాపారస్థులు కంగారుపడిపోయారు. నల్లవాళ్లను పిలుచుకు వెళ్లినప్పుడు తెల్లవాళ్లకు వీళ్ల వ్యాపార రహస్యాలు తెలియవు. భారతీయులు వ్యవసాయదారులైతే ఫరవాలేదుగాని వ్యాపారంలో సైతం పోటీకి దిగేసరికి తెల్లవాళ్లు సహించలేకపోయారు. భారతీయుల యెడ అసూయ కలగడానికి ఇదే ముఖ్య కారణం. దీనికి మరిన్ని ఇతర కారణాలు కూడా తోడు అయ్యాయి. నల్లవారి రకరకాల జీవన పద్ధతులు, కొంచెం వ్యయమైనా మప్పితంగా గృహ నిర్వహణ కావించుకోగల స్థితి, అల్ప లాభ సంతోషం, ఆరోగ్య నియమాలను గురించిన ఉదాసీనత, చుట్టుప్రక్కల్ని శుచిగా వుంచుకోవడంలో అశ్రద్ధ, ఇండ్లను మరమ్మత్తు చేయించి బాగా వుంచుకొనడంలో పిసినారితనం మొదలుగా గల వ్యవహారాలన్నింటి వల్ల వర్ణ ద్వేషమనే చిచ్చు బాగా రేగింది. ఈ ద్వేషం తరువాత వోటు హక్కు తొలగించే బిల్లు రూపంలోను, ఆ తరువాత గిరిమిటియాలు మూడు పౌండ్ల తలసరి పన్ను చెల్లించే బిల్లు రూపంలోను ప్రత్యక్షమైంది. ఈ శాసనాలే గాక అనేక చిక్కులు అదివరకే ఏర్పడి వున్నాయి. గిరిమిటియాలను, గిరిమిటియా కాలం అయిదేండ్లు ముగియక మునుపే ఆ గడువు ముగిసినట్లు