పుట:సత్యశోధన.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
140
బాలసుందరం
 

సివిల్ కోర్టులో దావా వేయవచ్చు. ఇండించెర్డు కూలివాడు అలా లేచి వెళ్లిపోతే యజమాని పూర్తిగా మరో చర్య గైకొనవచ్చు. వానిమీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. నేరం రుజూ అయితే కూలీకి శిక్ష కూడా పడవచ్చు. సర్ విలియం హంటరుగారు “ఇండించెర్డు కూలిపని, బానిసత్వం ఒక్కటే” అని అన్నారు. యజమానికి బానిస ఏవిధంగా ఆస్థిగా పరిగణింపబడతాడో అదే విధంగా ఇండించెర్డు కూలివాడు కూడా యజమాని ఆస్థిగా పరిగణింపబడతాడని దాని అర్ధం.

బాలసుందరం విడుదలకు రెండే రెండు మార్గాలు వున్నాయి. ఇండెంచెర్డు కూలివాళ్ళకు ప్రొటెక్టరు అనగా రక్షకుడు ఒకడు వుంటాడు. అతనితో చెప్పి కట్టడినుండి తప్పించవచ్చు. లేదా మరొక యజమాని దగ్గరకు బదలీ చేయించవచ్చు. ఒప్పుదల మీద బాలసుందరాన్ని యజమాని చేతనే విడుదల చేయించవచ్చు. ఇదంతా ఆలోచించి ఆ యజమానితో “మీ మీద నేరం మోపి మిమ్ము శిక్షింపచేయడం నా లక్ష్యం కాదు. మీరు అతణ్ణి క్రూరంగా కొట్టారు. మీరు ఆ విషయం గ్రహించేయుండవచ్చు. మీరు కరారునామాను మరొకరికి మార్చండి చాలు” అని అన్నాను.

నా మాటలు వినిన వెంటనే అతడు అందుకు అంగీకరించాడు. తరువాత నేను ప్రొటెక్టరును చూచాను. అతడు కూడా అంగీకరించాడు. కాని క్రొత్త యజమాని కావాలి కదా!

ఒక తెల్ల యజమాని కోసం వెతికాము. అప్పుడు భారతీయులు ఇండెంచెర్డు కూలీలను భరించే స్థితిలో లేరు. అప్పటికి నాకు కొద్దిమంది తెల్లవారితో పరిచయం ఏర్పడింది. ఒకరికి యీ సంగతి తెలియజేశాను. అతడు దయతో ఒప్పుకున్నాడు. నేనాతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. మేజిస్ట్రేటు బాలసుందరం అను కూలీ తన యజమానిపై నేరం మోపి తన కరారునామాను మరొకరికి బదలీ చేయుటకు అంగీకరించారని రికార్డు చేశాడు.

బాలసుందరం కేసు సంగతి కూలీలందరికీ తెలిసింది. నాకు “గిరిమిటియా బంధువు” అని పేరు వచ్చింది. నాకీ సంబంధం వల్ల ఎంతో ఆనందం కలిగింది. ఇక ప్రతిరోజు మా ఆఫీసుకు గిరిమిటియాలు అపరిమితంగా రాసాగారు. వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు నాకు మంచి అవకాశం లభించింది.

ఈ కేసు విషయం దూరాన ఉన్న మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రతిధ్వనించింది. మద్రాసు నుంచి నేటాలు వచ్చిన గిరిమిటియాలు తమ గిరిమిటియా సోదరుల వల్ల యీ విషయం తెలుసుకున్నారు.