పుట:సత్యశోధన.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

నేటాలు ఇండియన్ కాంగ్రెస్

లెక్క వ్రాస్తూ వున్నాం. ఆ విధంగా వ్యవహరించడం వల్ల యీనాడు పరీక్షించి చూచినా 1894 నాటి నేటాలు ఇండియన్ కాంగ్రెస్ లెక్కలు కరెక్టుగా వుంటాయి. ఆ విషయం యీ నాటికీ గట్టిగా నొక్కి వక్కాణించగలను. ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం. లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది. లెక్కల్ని సరిగాను శుద్ధంగాను ఉంచకపోతే సత్యాన్ని సరిగాను, శుద్దంగాను రక్షించలేము.

ఆ దేశంలో పుట్టి పెరిగి విద్యావంతులైన భారతీయులకు సేవ చేయడం ఈ కాంగ్రెస్ యొక్క రెండవ పని. అందుకోసం “కలోనియల్ బారన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్” అను ఒక సంఘాన్ని స్థాపించాము. ఇందలి సభ్యులంతా విద్యాధికులైన పిన్నవారే. వారు కొద్దిగా చందాలు యిస్తూ వుండేవారు. వారి కష్టాల్ని ప్రజలకు చెప్పడం, వారి తెలివి తేటల్ని పైకి తీయడం, వారికి హిందూ దేశపు వర్తకులకు సత్సంబంధం కల్పించడం, వారికి సేవచేసే విధానం తెలపడం. ఇవీ ఈ సంఘం పని. ఇది ఒక విధంగా చర్చలు జరుపు సమితి అన్నమాట. అందలి సభ్యులు అనేక విషయాలపై తప్పనిసరిగా చర్చలు చేస్తూ వుండేవారు. ఈ సంఘం కోసం చిన్న గ్రంధాలయం కూడా ఏర్పాటు చేశాం.

ప్రచారం చేయడం కాంగ్రెస్ మూడో పని. దక్షిణ ఆఫ్రికాలోను, ఇంగ్లాండులోను ఉన్న ఆంగ్లేయులకు, భారతీయులకు నేటాలులో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలుపడం అవసరం. ఈ దృష్టితో రెండు కర పత్రాలు తయారుచేశాను. “దక్షిణ ఆఫ్రికాలోని బ్రిటీష్ వారికి ఒక విన్నపం” (An appeal the every briton in South Africa) అను కరపత్రం ఒకటి. యిందు నేటాలు నందలి భారతీయుల స్థితిగతుల్ని గురించి సవివరంగా వ్రాశాను. “భారతీయుల ఓటు హక్కును గురించి ఒక విన్నపం” The Indian Franchise An Appeal అనునది రెండో కరపత్రం. ఇందు భారతీయుల ఓటు హక్కును గురించి కూలంకషంగా వివరించి వ్రాశాను. ఈ రెండు కర పత్రాలు తయారుచేయటానికి నేను ఎంతో శ్రమించాను. అంత శ్రమ పడినందుకు ఫలితం ఊహించనంతగా లభించడం గొప్ప విశేషం. వాటికి ఎంతో ప్రచారం లభించింది.

ఈ అలజడి వల్ల దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులు నాకు మంచి మిత్రులైనారు. ఇంగ్లాండునందు, హిందూ దేశమునందును గల అన్ని పార్టీల వారి ఆదరము మాకు లభించింది. ఇక ముందు చేయాల్సిన పనికి రాజమార్గం ఏర్పడింది.