పుట:సత్యశోధన.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

నేటాలు ఇండియన్ కాంగ్రెస్

ఈ విధంగా నెలకు ఒక్క పౌను చొప్పున యిచ్చే సభ్యులు ఎక్కువగా చేరారు. నెలకు పది షిల్లింగుల చొప్పున యిచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇదిగాక విరాళాలు చాలా మంది తమ శక్తిని బట్టి ప్రకటించారు.

ఈ వ్యవహారం చూచాక అడిగినంత ఎవ్వరూ విరాళం యివ్వరని నాకు బోధపడింది. దర్బానుకు ఆవలి ప్రాంతాల్లో వున్న వారిని మాటిమాటికి చందా అడగటం కష్టం. ఆరంభశూరత్వం ఎలా వుంటుందో కూడా బోధపడింది. దర్బను వాళ్లు ఎన్నిసార్లు తిరిగినా చందాలు యిచ్చేవారు కాదు.

నేను కార్యదర్శిని. అందువల్ల చందాలు పోగుచేసే పని నాది. వసూళ్లకై నాలుగు మాసాలు రోజంతా తిరగవలసి వచ్చేది. ఈ అనుభవం వల్ల నెల చందాలకు బదులు వార్షిక చందాలు, ముందుగానే వసూలు చేసేలా ఏర్పాటుచేయడం మంచిదని భావించాను. అందుకోసం సభ ఏర్పాటు చేశాను. నెలకు బదులు ఏడాదికి ఒక్క సారి చందా వసూలుచేయాలని, మూడు పౌండ్లు కనీసపు పద్దుగా వుండాలని అంతా నిర్ణయించారు. ఈ విధంగా నిర్ణయించినందున చందాల వసూలు పని సులభమైపోయింది.

అప్పు తెచ్చి ప్రజల కార్యాలు చేయకూడదని మొదటి నుండి నా అభిప్రాయం. డబ్బు తప్ప మిగతా ఏ విషయాల్ని గురించి, ఏ వాగ్దానాలనైనా అంగీకరించవచ్చునని అనుభవం మీద తెలిసింది. వాగ్దానం చేసిన వాళ్లు తిరిగి దాన్ని అదేవిధంగా బాధ్యతగా నేరవేర్చడం తక్కువ. నేటాలు భారతీయులు కూడా అంతే. డబ్బు చూచుకొని గాని కార్యక్రమాలకు నేను పూనుకోలేదు. అందువల్ల నేటాల్ కాంగ్రెస్ అప్పులపాలు కాలేదు.

నా సహచరులు క్రొత్త సభ్యుల్ని చేర్చాలని ఉత్సాహపడ్డారు. దానితో వారికి కూడా చాలా అనుభవాలు కలిగాయి. చాలామంది సంతోషంతో ధనం యివ్వడం ప్రారంభించారు. దూర ప్రదేశాలకు గ్రామాలకు ఉద్యమాన్ని వ్యాప్తం చేయడం కష్టమైపోయింది. ప్రజా సేవ అంటే ఏమిటో అక్కడి వాళ్లకు ముందు తెలియదు. చాలామంది ధనికులు మమ్మల్ని పిలిచి విరాళాలు యివ్వడం ప్రారంభించారు.

ఈ యాత్రలో ఒకసారి పెద్ద కష్టం ముంచుకు వచ్చింది. ఒక దాత ఆరు పౌండ్లు యిస్తాడని అనుకున్నాం. కాని అతడు మూడు పౌండ్లు కంటే మించి యివ్వనని భీష్మించాడు. మేము ఆ కొద్ది సొమ్ము ఆయన దగ్గర తీసుకుంటే మిగతా వారంతా అంతే యిస్తారు. అందువల్ల సొమ్ము ఎక్కువ వసూలు కాదు. ఆ రోజు రాత్రి