పుట:సత్యశోధన.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
135
 

నేటాలు నందలి వకీళ్ల సభవారి ప్రతిఘటన వల్ల దక్షిణ ఆఫ్రికాలో మరో మారు నా పేరు మారు మ్రోగింది. చాలా పత్రికల వాళ్లు ఆక్షేపణల్ని ఖండించారు. వారి వ్యతిరేకతకు కారణం ఈర్ష్యయే అని ప్రకటించారు. ఈ ప్రసిద్ధి వల్ల నా కార్యక్రమాల్లో కొన్ని అంశాలు సరళమయ్యాయి.

19. నేటాలు ఇండియన్ కాంగ్రెస్

న్యాయవాద వృత్తి నిజంగా నాకు అప్రధానం. చివరివరకూ అప్రధానంగానే వుండిపోయింది. నేటాలు రాష్ట్రంలో నా నివాసం సార్ధకం కావాలంటే నేను ప్రజాసేవలో లీనం కావాలి. అర్జీలు పంపినంత మాత్రాన ఫ్రాంచైజు పని పూర్తికాదు. ఇల్లలుకగానే పండగ కాదు గదా! ఎప్పుడూ అలజడి జరుపుతూ వుండాలి. అప్పుడు యీ విషయం వలన రాజ్యాల కార్యదర్శికి తెలుస్తుంది. అలా జరగాలంటే అందుకు ఒక శాశ్వతమైన సంస్థ అవసరమని అనిపించింది. అబ్దుల్లా సేఠ్‌ గారితోను, మిగతా మిత్రులతోసు సంప్రదించి ఒక శాశ్వత సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాను.

ఈ సంస్థకు పేరు ఏమని పెట్టడం? చాలా ధర్మ సందేహాలు కలిగాయి. అది ఏ పక్షం వైపుకు మొగ్గకూడదు. కాంగ్రెస్ అను పేరు ఇంగ్లాండు నందలి కన్సర్వేటివు పార్టీ వారికి రుచించదని నాకు తెలుసు. కాని హిందూ దేశానికి కాంగ్రెస్ ప్రాణం. నేటాలులో శక్తిని వృద్ధి చేయాలని భావించాను. ఆ పేరుకు భయపడటం పిరికితనం అని తోచింది. ఈ కారణాలన్నీ తెలియజేసే ఈ సంస్ధకు “నేటాలు ఇండియన్ కాంగ్రెస్” అని పేరు సూచించాను. అంతా అంగీకరించారు. 1894 వ సంవత్సరం మే 22వ తేదీన నేటాలు ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది.

ఆనాడు విశాలమైన అబ్దుల్లా సేఠ్‌గారి గది క్రిక్కిరిసి పోయింది. సభ్యులంతా కాంగ్రెసుకు స్వాగతం చెప్పారు. కాంగ్రెసు నియమాలు తక్కువే కాని చందా మాత్రం ఎక్కువ. నెలకు అయిదు షిల్లింగులు చెల్లిస్తేనే సభ్యులవుతారు. శక్తివంచన లేకుండా ధనికులు చందాలు యిమ్మని ప్రోత్సహించాము. అబ్దుల్లాగారు మొదటి పద్దుగా రెండు పౌండ్ల విరాళం ప్రకటించారు. తరువాత యిద్దరు మిత్రులు అంత పద్దు చేశారు. “నేను ఏం చేయడమా?” అని ఆలోచించి ఆ తరువాత ఒక పౌను విరాళం నేను వ్రాశాను. యిది నా శక్తికి మించిన పని. అయితే సంపాదన ప్రారంభమైతే యీ మాత్రం యివ్వగలనని నేను సాహసించాను. ఈశ్వరుడు అందుకు సహకరించాడు.