పుట:సత్యశోధన.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
134
వర్ణద్వేషం
 

తెలుపు అను భేదం లేదు. కావున గాంధీ గారిని చేర్చుకొనకుండా వుండుటకు కోర్టుకు హక్కు లేదు. అందువల్ల అతని దరఖాస్తును మేము మంజూరు చేస్తున్నాము. గాంధీ గారూ! మీరు ప్రమాణం చేసి అడ్వొకేటుగా చేరండి” అని అన్నాడు. నేను లేచి రిజిస్ట్రారు దగ్గరకు వెళ్లి ప్రమాణం చేశాను. నేను ప్రమాణం చేయగానే ప్రధాన న్యాయాధీశుడు నన్ను సంబోధించి “గాంధీగారూ! మీరు యిక తలపాగా తీసివేయాలి. ప్రాక్టీసు చేయు బారిస్టర్లు కోర్టు వారు నిర్ణయించే వేష నియమాలను పాటించాలి. కోర్టు నియమాలకు మీరు లోబడాలి.” అని అన్నాడు. నాకు నా మర్యాద తెలుసు. జిల్లా మేజిస్ట్రేటు కోర్టులో పాగా తీసేయమంటే నేను నిరాకరించాను. ఇప్పుడు సుప్రీం కోర్టువారి ఆదేశం ప్రకారం పాగా తీసివేశాను. నేను వారి ఆదేశాన్ని నిరాకరించవచ్చు. అట్లా చేయడం సమ్మతం కూడా. కాని నేను చేయాల్సిన పోరాటాలు చాలా వున్నాయి వాటికోసం నా శక్తిని అదుపులో వుంచుకోవాలని భావించాను. తలపాగా తొలగించ కూడదనే పట్టుదల బట్టితే ప్రయోజనం? ఇంతకంటే పెద్ద కార్యాలు నేను ఎన్నో చేయాల్సిన అవసరం వుందికదా!

నేనిట్లా లోబడినందుకు (ఇది లోబడటమా?) అబ్దుల్లా సేఠ్‌గారు, తదితర మిత్రులు ఆక్షేపించారు. కోర్టులో ప్రాక్టీసు చేసేటప్పుడు తలపాగా ధరించాలనే ధైర్యం వహించితే బాగా వుండేదని వారి భావం. వారికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. “దేశాన్ని బట్టి ఆచారాలు” మారాలని వారికి తెలియజేసేందుకు ప్రయత్నించాను. “హిందూ దేశంలో తెల్ల అధికారి తలపాగా తీసివేయమని ఆదేశిస్తే దానికి లోబటడం సిగ్గుచేటు. కాని నేటాలు కోర్టులో ఆ కోర్టు ఆచారాల్ని నియమాల్ని నిరాకరించకూడదు” అని చెప్పాను.

నేను చెప్పిన కారణాలు వారికి నచ్చలేదు. అయినా కొద్దిగా శాంతించారు. ఒక విషయాన్ని వివిధ సందర్భాలను బట్టి వివిధ రకాలుగా చూడవలసి వస్తుందన్న సంగతిని వారిచే ఒప్పించలేకపోయాను. నా జీవితమందంతట సత్యము యెడగల పట్టుదలయే రాజీ యొక్క సౌందర్యాన్ని నా చేత ఆస్వాదింప చేయగలిగింది. ఈ పద్ధతి సత్యాగ్రహము నందు అనివార్యమని నా తరువాతి జీవితంలో తెలుసుకోగలిగాను. ఆ పద్ధతి నా ప్రాణాలకు ముప్పుగా కూడా పరిణమించేది. అంతేగాక మిత్రుల అసంతోషానికి మూలమయ్యేది. దాన్ని కూడా సహించవలసి వచ్చేది. సత్యం వజ్రం పలె కఠోరం కుసుమం వలె కోమలం గదా!