పుట:సత్యశోధన.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
133
 

తనను ఒకసారి కలుసుకోమని ఆయన నాకు కబురు పంపాడు. నేను వెళ్లి ఆయనను కలిశాను. ఆయన నిష్కపటంగా నాతో మాట్లాడి నా వృత్తాంతం తెలుసుకున్నాడు. “మీకు వ్యతిరేకంగా నేనేమీ చేయను. మీరు కాలనీలో పుట్టిన రకమేమోనని భయపడ్డాను. మీ అర్జీతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్టు లేకపోవడం వల్ల నా అనుమానం పెరిగింది. మరింకొకరి సర్టిఫికెట్టు చూపించేవాళ్లు కూడా వుంటారు. మీరు యిక్కడ తెల్ల దొరల దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకున్నారు. అవి నాలుక గీచుకోడానికి కూడా పనికిరావు. మీ యోగ్యతను గురించి వారేం ఎరుగుదురు? వారెంత కాలం నుండి మిమ్మల్ని ఎరుగుదురో చెప్పండి” అని ఆయన అడిగాడు.

“ఇక్కడి వాళ్లంతా నాకు క్రొత్తవాళ్లే. ఇచ్చటికి రాక ముందు అబ్దుల్లా సేఠ్‌గారు కూడా నన్నెరుగరు” అని జవాబిచ్చాను.

“అబ్దుల్లా సేఠ్‌గారిది మీ ఊరే అని అన్నారుగదా! మీ తండ్రిగారు దివాను గారు గదా! సేఠ్ వారిని బాగా ఎరిగే వుంటారు. కనుక అబ్దుల్లా సేఠ్ గారి నుండి ఒక అఫిడవిటు తీసుకురండి. ఇక మిమ్మల్ని ఏమీ అడగవలసిన పని వుండదు.” అని ఆయన అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని అణుచుకున్నాను. నేను మొదటగానే అబ్దుల్లా సేఠ్ గారి దగ్గర ప్రమాణ పత్రం తీసుకొని దాఖలు చేసి యుంటే, యిది పనికి రాదు, తెల్లవారి ప్రమాణ పత్రం కావాలని అనేవారు. అయినా నన్ను అడ్వకేటుగా అంగీకరించేందుకు నా పుట్టుపూర్వోత్తరాలతో పనేమిటి? నా తల్లిదండ్రులు చెడువారు కావచ్చు లేక మంచివారు కావచ్చు. వారి మంచిచెడులతో నా అడ్వకేట్ వృత్తికి సంబంధం ఏమిటి? ఈ విధంగా లోలోన మధన పడి యోచనల్ని అదుపులో పెట్టుకొని యిలా అన్నాను. “నా వకీలు వృత్తి కోసం వకీళ్ల సభవారి యిట్టి భావాల్ని నేను అంగీకరించను. అయినా మీరు చెప్పిన ప్రకారం అఫిడవిట్ తప్పక దాఖలు చేస్తాను" అని అన్నాను.

అబ్దుల్లా సేఠ్ గారి దగ్గర అఫిడవిట్ తీసుకొని తెల్ల వకీలుకు అందజేశాను. ఆయన తాను సంతృప్తిపడ్డానని చెప్పాడు కాని వకీళ్ల సభ వాళ్లు తృప్తిపడలేదు. వారు నా దరఖాస్తును వ్యతిరేకించారు. కాని కోర్టు వారు అటార్నీ జనరల్ పని లేకుండానే వకీలు సభవారి ఆక్షేపణల్ని త్రోసిపుచ్చారు. ప్రధాన న్యాయాధీశుడు కల్పించుకొని “అర్జీదారు ఇంగ్లీషు సర్టిఫికెట్టు చూపలేదను ఆక్షేపణ యుక్తిపరమైంది కాదు. అతడు అబద్ధపు సర్టిఫికెట్టు పంపియుంటే అతనిపై నేరం మోపవచ్చు. ఆ నేరం నిజమని రుజువైతే అతని పేరు వకీలు పట్టిక నుంచి తొలగించవచ్చు. శాసనాలకు నలుపు