పుట:సత్యశోధన.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

131

తేగలుగుతాననీ నిర్ణయానికి వచ్చాను. అయితే అట్టి గృహానికి సాలీనా మూడు వందల పౌండ్లు ఖర్చువుతుందని తేలింది. అంత రాబడికి అవసరమయ్యే కేసులిచ్చేందుకు హామీ పడితేనే అక్కడ వుంటానని వాళ్లకు తెలియజేశాను. “ప్రజాహిత కార్యాలకు మీరు చెప్పినంత పైకం యిస్తాం. అంత సొమ్ము మేము తేలికగా వసూలు చేయగలం. మీ ప్రాక్టీసుకు, దీనికి సంబంధం పెట్టవద్దు.” అని వాళ్లు అన్నారు. “అట్లా వీల్లేదు. నేను ప్రజాహిత కార్యాలు నిర్వహిస్తూ అందు నిమిత్తం మీ దగ్గర డబ్బు తీసుకోను. ఇందుకు బారిస్టరు తెలివితేటలు పనిచేయనవసరం లేదు. మీ చేత పనిచేయించుతూ, నాకోసం మీదగ్గర డబ్బు తీసుకోవడమా? సార్వజనిక కార్యాలకు జనం దగ్గర చందాలు పుచ్చుకోవలసి వస్తుంది. అట్టి ధర్మ నిధి నుండి నేను జీతం పుచ్చుకుంటూ, మిమ్మల్ని చందాలు ఎలా కోరగలను? అలా చేస్తే చివరికి బండి ఆగిపోతుంది. ధర్మకార్యాలకు సాలుకు మూడు వందల పౌండ్ల కంటే ఎక్కువ కావలసి వస్తుంది” అని చెప్పాను.

“కొంతకాలం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. మీ సంగతి మాకు తెలిసింది. కావలసిన దానికంటే ఒక్క కానీ కూడా మీరు ఎక్కువ పుచ్చుకోరు. మేము మిమ్మల్ని యిక్కడ ఆపినప్పుడు మీకు అవసరమయ్యే ధనం యివ్వవద్దా?”

“ప్రేమతోను, ఉత్సాహంతోను మీరు యిలా అంటున్నారు. ఈ ప్రేమ, యీ ఉత్సాహం స్థిరంగా వుంటాయని భావించగలమా? మిత్రుని వలె, సేవకుని వలె కొన్ని సమయాల్లో నేను కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. అప్పుడు మీ ఆదరణకు ఎంతగా పాత్రుడనవగలనో ఆ భగవంతునికే ఎరుక. ధర్మకార్యాలకు మీ దగ్గర భృతి తీసుకోవడం కల్ల. అందువల్ల మీ కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించండి చాలు. దీనివల్ల మీకు యిబ్బంది కలుగునని నాకు తెలుసు. నేను తెల్ల బారిస్టరును కాను! కోర్టు నన్నెంత వరకు ఆదరిస్తుందో కూడా తెలియదు. పైగా లాయరుగా నేను ఎంత వరకు పనికివస్తానో కూడా తెలియదు. నాకు రిటైనర్లు (ఇంకొకరి కేసు పుచ్చుకోకుండా తమకేసుకోసం పని చేయించుకొనుటకు బారిస్టరు మొదలగు వారికి ముందుగా యిచ్చే ఫీజు) ఇచ్చినందున మీకు ఇబ్బందులు కలగవచ్చు. అయినా ఆ కొద్ది సొమ్ము కూడ ప్రజా సేవకు ప్రతిఫలమే అవుతుంది.” అని అన్నాను.

ఈ చర్చానంతరం 20 మంది వర్తకులు ఒక సంవత్సరం వరకు నాకు రిటైనర్లు యిచ్చేందుకు సిద్ధపడ్డారు. నేటాలు విడిచి వెళ్లేటప్పుడు దాదా అబ్దుల్లా సేఠ్ నాకు కానుకగా కొంత సొమ్ము యివ్వదలిచాడు. ఆ సొమ్ముతో నాకు కావలసిన కుర్చీలు, బెంచీలు మొదలగునవి కొనిపెట్టాడు. ఈ విధంగా నేను నేటాలులో వుండిపోయాను.