పుట:సత్యశోధన.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
126
రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు
 

బిల్లును గురించి చర్చలు సాగుతున్నాయి. ఈ కొద్ది వాక్యాలు ఆ చర్చకు సంబంధించినవే. నాకు ఆ చట్టాన్ని గురించి ఏమీ తెలియదు. విందుకు వచ్చిన అతిథులెవ్వరికీ తెలియదు. దాన్ని గురించి అబ్దుల్లా సేఠ్‌తో ప్రస్తావించాను. “ఈ వ్యవహారాలు మాకేం తెలుస్తాయి? వ్యాపారానికి సంబంధించినవైతే మాకు తెలుస్తాయి. అరెంజి ఫ్రీస్టేటులో మా వ్యాపారమంతా నీట కలసిన విషయం నీకు తెలుసు. ఆ విషయమై మేము కొంత కలకలం రేపాము. కాని ఏం లాభం? చదువురాదు గనుక మేము అసమర్ధులం. బజారు ధరలు తెలుసుకోవడానికి మాత్రం మేము పత్రికలు చదువుతాము. చట్టాల గొడవ మాకేం తెలుస్తుంది? ఆ తెల్ల వకీళ్లే మాకు కండ్లు, చెవులూను” అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు. భారతీయ క్రైస్తవులను గురించి వివరంగా అబ్దుల్లా సేఠ్ చెబుతూ “వారా? వారికి మేమంటే అలుసు. వారంటే నిజానికి మాకూ అలుసే. క్రైస్తవులు కనుక వారు తెల్లవారికి బానిసలు. ఆ తెల్లఫాదరీలు ప్రభుత్వానికి బానిసలు” అని అన్నాడు. వారి మాటలు నా కండ్లు తెరిచాయి. ఈ శాఖ మనకు సంబంధించింది. వారూ మనమూ ఒకటే అని తెలియజేయడం అవసరం అని అనిపించింది. ఏసు మతానికి యిదా అర్థం? వారి మతం మార్చుకున్నంత మాత్రాన భారతీయులు కాక విదేశీయులైపోతారా?

అయితే నేను మన దేశానికి రాబోతూ వున్నాను. అందువల్ల నా ఈ అభిప్రాయం వారికి చెప్పలేదు. అబ్దుల్లా సేఠ్‌గారితో “ఈ బిల్లు శాసనం అయితే మనవాళ్ల కష్టాలకు అంతే వుండదు. ఇది భారతీయులకు ప్రధమ ఉచ్చాటన మంత్రం. మన ఆత్మగౌరవానికి వేరు పురుగు” అని చెప్పాను. “కావచ్చును. కాని ఫ్రాంచైజుకు మూలం ఏమిటో చెబుతాను. మాకు మొదటిదాన్ని గురించి ఏమీ తెలియదు. ఎస్కాంబీగారిని మీరు ఎరుగుదురు కదా! అతడు మనకు పెద్ద వకీలు. ధీరుడు. అతడే మొదట ఈ విషయం మా బుర్రల కెక్కించాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంస్కాంబీ పెద్ద యోధుడుకూడా. అయనకు మరియు వారుద్ ఇంజనీరుకు మధ్య పడేది కాదు. అందువల్ల ఆ ఇంజనీయరు తన వోట్లన్ని పుచ్చుకొని ఎన్నికల్లో ఎక్కడ ఓడిస్తాడో అని ఎస్కాంబీ దిగులు పడ్డాడు. అప్పుడాయన ఆ విషయం మాకు చెప్పాడు. ఆయన ప్రోత్సాహంతో మేమంతా మా పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాము. ఎన్నికల్లో ఎస్కాంబీ గారికి మా ఓట్లు యిచ్చాం. అంతేగాని మా ఓట్లకు మేమే విలువ ఇవ్వడం లేదు. యిది స్పష్టం. అయితే మీ మాటలు మాకు అర్ధం అవుతాయి. మీ సలహా ఏమిటో చెప్పండి” అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు.