పుట:సత్యశోధన.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
122
నేను పడ్డ మధన
 


15. నేను పడ్డ మధన

క్రైస్తవ మిత్రుల వల్ల నాకు కలిగిన అనుభవాల్ని వివరిస్తాను.

బేకరు గారికి నా భవిష్యత్తును గురించి ఆతురత ఎక్కువైంది. ఆయన నన్ను వెల్లింగ్టన్ పట్టణంలో జరిగిన సభకు తీసుకువెళ్లారు. ప్రొటెస్టెంట్ తెగవారు ధర్మ ప్రభోదానికి, ఆత్మ పరిశుద్ధికి, కొన్ని సంవత్సరాలకు ఒక్కో పర్యాయం అట్టి సమ్మేళనాలు జరుపుతూ వుంటారు. ఇవి ధర్మపునరుద్ధరణకు, ధర్మ పునః ప్రతిష్టకు నిర్దేశింపబడిన సమ్మేళనాలు. దానికి అధ్యక్షుడు రివరెండు ఆండ్రూమురే. ఆయన ఆ పట్టణంలో ప్రధాన మతాచార్యుడు. ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆ సమ్మేళనంలో జరిగే మతప్రబోధం, అచ్చటికి వచ్చేవారి మహోత్సాహం, దాని పవిత్రత మొదలగు వాటిని చూచి నేను ఏసుమతంలో తప్పక కలిసిపోతానని బేకరుగారు భావించారు.

బేకరుగారికి ప్రార్ధనా బలమే మహాబలం. ప్రార్ధనపై ఆయనకు అమిత విశ్వాసం, హృదయ పూర్తిగా చేయబడే ప్రార్ధనను భగవంతుడు తప్పక వింటాడని ఆయన విశ్వాసం. ఐహిక సంబంధమైన కోరికలు కూడా ప్రార్ధన వల్ల నెరవేరుతాయని నమ్మే బ్రిస్టల్ నివాసి జార్జి ముల్లర్ వంటి వారిని ఆయన ప్రమాణంగా పేర్కొంటారు. ప్రార్ధనా మహిమను గురించి ఆయన చెబుతూ వుంటే నేను తటస్థభావంతో వినేవాణ్ణి. అంతరాత్మ గనుక ప్రబోధిస్తే నేను తప్పక ఏసు మతంలో చేరతాననీ, అట్టి స్థితిలో ప్రపంచమందలి ఏ శక్తీ నన్ను ఆపలేదని బేకరు గారికి చెప్పాను. యీ విధమైన వాగ్దానం చేయుటకు నేను సందేహించలేదు. అప్పటికే నేను అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవడం ప్రారంభించాను. అంతరాత్మ చెప్పిన రీతిగా నడుచుకోవడమంటే నాకు ఆనందంగా వుండేది. వాస్తవానికి విరుద్ధాచరణ కష్టదాయకం. దుఃఖప్రదం కూడా.

మేము వెల్లింగ్టన్ పట్టణం వెళ్లాము. నా వంటి నల్లవాడిని వెంటబెట్టుకు వెళ్లడం వలన బేకరు గారికి చాలా కష్టాలు కలిగాయి. దారిలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. మధ్యలో ఆదివారం వచ్చినందున మా ప్రయాణం ఆగిపోయింది. బేకరు గారు, వారి బృందంలోని వారు ఆదివారం నాడు ప్రయాణం చేయరు. మేము ఒక స్టేషనులో ఆగాము. అక్కడి హోటలు యజమాని వాద ప్రతివాదాలు జరిగిన తరువాత నాకు భోజనం పెట్టేందుకు అంగీకరించాడు. అయితే భోజనశాలలో అందరి సరసన