పుట:సత్యశోధన.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

121

అంటే అదీ లేదు. ఒకరు మరొకరికి ఖర్చు చెల్లించాలంటే దానికి “కోర్టు ఫీజు రెగ్యులేషన్” ప్రకారం ఒక పద్ధతి వుంది. అయితే లాయర్ల కిచ్చే ఫీజు ఆ ప్రకారం లభించే సొమ్ము కంటే ఎంతో అధికం. యీ విషయాలన్నీ మొట్ట మొదటి సారి తెలుసుకున్నాను.

ఇక సహించలేకపోయాను. ఈ దావాను పరిష్కరించడం నా కర్తవ్యమని భావించాను. రాజీ వ్యవహారం ముందుకు సాగిస్తున్నప్పుడు నా ప్రాణాలు పోయినంత పని అయింది. చివరికి తైయబ్ సేఠ్ రాజీకి అంగీకరించాడు. ఒక మధ్యవర్తి నియమించబడ్డాడు. దావా ఆ మధ్యవర్తి ముందు నడిచింది. దాదా అబ్దుల్లా గెలిచాడు.

అయినా నాకు తృప్తి కలుగలేదు. మధ్యవర్తి తీర్పును దాదా అబ్దుల్లా వెంటనే అమలుబరిస్తే తైయబ్ హాజీఖాన్ మహమ్మద్ అన్ని రూపాయలు ఒక్కసారిగా తెచ్చి కుమ్మురించలేడు. దక్షిణ - ఆఫ్రికాలో నివసిస్తున్న పోరుబందర్ వర్తకుల్లో వ్రాయబడని శాసనం ఒకటి వుంది. దివాళా కంటే చావు మేలు అనేదే ఆ శాసనం. తైయబ్ సేఠ్‌గారు ఒక్కసారిగా 37 వేల పౌండ్లు ఖర్చుల క్రింద చెల్లించలేడు. ఆయన పైసలతో సహా బాకీ తీర్చివేసేందుకు సిద్ధమే. కాని దివాళా తీశాడనే అపవాదు రాకూడదు. ఇందుకు ఒక్కటే ఉపాయం, వాయిదాల మీద సొమ్ము తీసుకొనేందుకు దాదా అబ్దుల్లా ఒప్పుకోవాలి. ఆ ప్రకారం దీర్ఘకాలపు వాయిదాల మీద సొమ్ము పుచ్చుకోవడానికి ఉదారబుద్ధితో దాదా అంగీకరించాడు. రాజీకి ఉభయుల్ని ఒప్పించడానికి పడ్డ శ్రమ కంటే వాయిదాల మీద సొమ్ము చెల్లింపుకు అంగీకరింపచేయడానికి నేను పడ్డ శ్రమ ఆ భగవంతుడికే ఎరుక. అయితే ఇదంతా జరిగాక ఇద్దరూ సతోషించారు. యిద్దరికీ గౌరవం పెరిగింది. నాకు అపరిమితంగా ఆనందం కలిగింది. వకీలు పని ఏమిటో, దాని సత్యస్వరూపం ఏమిటో అప్పుడు నాకు బోధపడింది. మనిషిలోని గుణాల్ని, వారి సత్పక్షాన్ని తెలుసుకోగలగటం ఎలాగో తెలుసుకోగలిగాను. విడిపోయిన వాది ప్రతివాదుల్ని కలవడమే వకీలు యొక్క పరమ ధర్మమని గ్రహించాను. ఈ సత్యం నాలో బాగా నాటుకు పోయింది. అందువల్ల తరువాత 20 ఏండ్ల బాటు నేను సాగించిన ప్లీడరు వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు ఎక్క కుండానే పరిష్కరించగలిగాను. అందువల్ల నాకు నష్టమేమీ కలగలేదు. రాబడిని కోల్పోలేదు. ఆత్మతృప్తి కలిగింది. అంతకంటే యింకేమి కావాలి?