పుట:సత్యశోధన.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

115

ఆయనకు మంచి అభిప్రాయం వున్నది. కాని అతనికి అక్కడ తగిన పరపతి లేదు. సమయం వచ్చినప్పుడు సాయపడతాను, అవసరం అయినప్పుడు వచ్చి నన్ను కలవమని ఆయన చెప్పాడు.

ఇక రైల్వే వారితో చర్చలు ప్రారంభించాను. మీ నియమాల ప్రకారం హిందువులకు కష్టాలు కలుగకుండ చూడమని వాళ్లను కోరాను. సరియైన వేష భాషలుంటేనే పెద్ద తరగతి టిక్కెట్లు యివ్వబడతాయని రైల్వే వారినుండి సమాధానం వచ్చింది. అయితే వీని వల్ల ప్రయోజనం చేకూరదు. వేష భాషలు సరిగా వున్నాయా లేదా అని నిర్ణయించే అధికారి ఎవరు? స్టేషను మాస్టరే అట్టి అధికారి. అందువల్ల ప్రయోజనం శూన్యం అని ప్రకటించాను.

హిందువులకు సంబంధించిన కొన్ని పత్రాలు బ్రిటీష్ ఏజంటు చదవమని నాకు యిచ్చాడు. ఇట్టివి కొన్ని తైయబ్జీ గారి దగ్గర కూడా నాకు లభించాయి. ఆరెంజి ఫ్రీస్టేటు నుండి భారతీయులు ఎంత నిర్దయగా వెళ్లగొట్టబడ్డారో ఆ కాగితాలు చదవడం వల్ల నాకు తెలిసింది.

ట్రాన్సువాలు ఫ్రీ స్టేటుల్లోని భారతీయుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు సమస్తం నాకు బోధపడ్డాయి. వీటిని చదవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేదు.

ఆ ఏడు గడిచిన తరువాత, దావా వ్యవహారం తేలిపోగానే ఇంటికి వెళ్లాలని నా భావన. కాని దైవేచ్ఛ వేరుగా వుంది.

13. కూలి వృత్తి

ట్రాన్సువాలు ఆరెంజి ఫ్రీస్టేటులోని భారతీయుల స్థితిగతులను గూర్చి పూర్తిగా వ్రాయడానికిది తావు కాదు. తెలుసుకోదలచినవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర చదవడం మంచిది. ఆరెంజి ఫ్రీ స్టేటుయందు 1888వ సంవత్సరంలోనో లేక అంతకు ముందో పుట్టిన ఒక శాసనం వల్ల భారతీయుల స్వాతంత్ర్యమంతా హరించిపోయింది. ఒకవేళ భారతీయులెవరైనా అచ్చట వుండదలిస్తే హోటళ్లలో సేవకులుగానో లేక మరేదైనా బానిస వృత్తియో చేస్తే వుండవలసిందే. పేరుకు మాత్రం కొద్దిగా ముదరా యిచ్చి భారతీయ వ్యాపారస్థుల్ని వెళ్లగొట్టారు. వారు అర్జీలు పెట్టుకున్నారు. ప్రార్ధనా పత్రాలు పంపుకున్నారు. కాని వినిపించుకునే నాధుడు లేడు.