పుట:సత్యశోధన.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
114
భారతీయులతో పరిచయం
 

నేను తెల్లవారిని ఉదాహరణగా చెప్పి నల్లవారు ఎంత అశుచిగా వుంటారో, ఎంత దుష్టంగా ప్రవర్తిస్తారో వివరించాను. పారశీకులు, క్రైస్తవులు, మరాఠీ, గుజరాతీ, మదరాసీ, పంజాబీ, సింధీ, కచ్ఛీ, సూరతీ మొదలుగా గల భేదాలు మరిచిపొమ్మని ఉద్భోదించాను. ఒక సంఘాన్ని స్థాపించి, భారతీయులు పడుతున్న కష్టాల గురించి అర్జీలు పంపవలసిన అవసరం ఎంతైనా వుందని చెప్పి అట్టి సంఘంలో జీతం తీసుకోకుండా నేను పని చేస్తానని చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను. నా ఉపన్యాసం సభను ఆకట్టుకొని ప్రభావితం చేసిందని గ్రహించాను. దానిపై చర్చలు జరిగాయి.

తమ తమ కష్టాల్ని చెప్పడానికి కొందరు ముందుకు వచ్చారు. నాకు కూడా ఉత్సాహం కలిగింది. వారిలో ఇంగ్లీషు వచ్చిన వారు కొద్దిమందే. యీ పరదేశంలో ఇంగ్లీషు రావడం అవసరమనీ, ప్రయోజనకరమనీ వారికి చెప్పాను. పెద్దవారైనా సరే చదువుకోవచ్చునని చెప్పి కొందరి పేర్లు ఉదాహరణగా పేర్కొన్నాను. మీరు ఇంగ్లీషు నేర్చుకొంటానంటే నేను బోధిస్తాను, మీకు తీరిక వున్న సమయం తెలిపితే నేనే స్వయంగా వచ్చి మీకు ఇంగ్లీషు నేర్పుతానని చెప్పాను. కొందరు నేర్చుకునేందుకు ముందుకు వచ్చారు. వారిలో యిద్దరు మహమ్మదీయులు. ఒకరు మంగలి, ఒకరు గుమాస్తా, మూడవ వాడు హిందువు. ఒక చిన్న దుకాణదారు. నేనందరికీ అనుకూలుడనైనాను. బోధన చేయగలిగాను. కాని నా శిష్యుల్లో కొందరు ఏమరుపాటు చూపించారు. కాని నేను మాత్రం ఓర్పుతో వ్యవహరించాను. వారి గృహాలకు వెళ్లాను. కాని వారికి సమయం చిక్కలేదు. ఇంగ్లీషులో పండితులు కావాలని వాళ్లకు కోరిక లేదు. అయినా యిద్దరు మాత్రం ఎనిమిది నెలలకు కొంత తేలారు. జమా ఖర్చులు వ్రాయడం, రాతకోతలు నేర్చారు. తన ఖాతాదారులతో కొంచెం ఇంగ్లీషుతో మాట్లాడగలిగితే చాలని మంగలి ఉద్దేశ్యం. వారిలో యిద్దరు ఇంగ్లీషు నేర్చుకొని ధనార్జన చేయసాగారు కూడా.

సభ వల్ల కలిగిన యీ ప్రయోజనం చూచి నాకు సంతోషం కలిగింది. అట్టి సభలు ప్రతి వారమూ ప్రతినెలా జరపాలని నిర్ణయం చేశాం. మొత్తం మీద మేమనుకున్నట్లుగా సభలు జరుగుతూ వున్నాయి. యీ సభలలో ఒకరి అభిప్రాయం మరొకరు తెలసుకోగలిగేవారు. యీ కారణం వల్ల ప్రిటోరియలో గల ప్రతి భారతీయునితో నాకు పరిచయం ఏర్పడింది. తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. అందువల్ల యిక అక్కడ వున్న బ్రిటిష్ ఏజంటుతో పరిచయం పెంచుకోవాలని భావించాను, వారిని దర్శించాను. ఆయన పేరు జాకోబ్స్ డీనెట్. హిందూ దేశస్థులపై