పుట:సత్యశోధన.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
113
 

అన్నాడని ఏసు మతం మీద నాకు ఈర్ష్యాద్వేషాలు కలుగవని నచ్చచెప్పాను. నాకు గల తపన బైబిలును గురించియే, దాని తత్వార్ధాన్ని గురించియే.

12. భారతీయులతో పరిచయం

క్రైస్తువులను గురించి వ్రాసే పూర్వం అప్పటి నా యితర అనుభవాల్ని గురించి కూడా కొంచెం వివరిస్తాను.

నేపాలు రాష్ట్రంలో దాదా అబ్దుల్లా గారెంతో ప్రిటోరియాలో సేఠ్ తైయబ్ హాజీ ఖాన్‌గారంత. అందరికీ ఉపయోగపడే ఏ ధర్మ కార్యమైనా ఆయన లేకుండా జరుగదు. నేను అక్కడికి వెళ్లిన మొదటి వారంలోనే వారిని పరిచయం చేసుకున్నాను. “నాకు ప్రిటోరియా యందలి భారతీయులందరితోను పరిచయం పెంచుకోవాలని వున్నది. యిక్కడి హిందూదేశస్థుల ఆనుపానులు నాకు తెలుసుకోవాలని వుంది. అందుకు మీ సాయం కావాలి.” అని నేను అనగానే అన్ని విధాల సహకరిస్తానని మాట యిచ్చాడు.

భారతీయులందరినీ ఒకచోట సమావేశపరిచి వారి స్థితిగతులు వారికి అవగతం చేయడం అవసరమని నాకు తోచింది. సేఠ్ హాజీ మహమ్మద్ అను వారి పేరట కూడా నా దగ్గర పరిచయ పత్రం వున్నది. సభను సేఠ్‌గారి ఇంట్లో ఏర్పాటు చేశాం. సభికులంతా మేమన్ వర్తకులు. హిందువుల సంఖ్య బహు స్వల్పం ప్రిటోరియాలో స్థాయి గల హిందువులు మాత్రం వచ్చారు.

నా జీవితంలో యిదే మొదటి ఉపన్యాసం. ఆ ఉపన్యాసం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఉపన్యాసంలోని విషయం సత్యం. కాని వాణిజ్యంలో సత్యం నడవదు, అసంభవం అని కొందరు వర్తకులు నాతో వాదించారు. నేను అప్పుడు వారి వాదాన్ని విశ్వసించలేదు యిప్పుడూ విశ్వసించలేదు. సత్యం, వ్యాపారం రెంటికీ పొంతన కుదరదు. అనే వర్తకులు యిప్పటికీ పున్నారు. వ్యవహారం వేరు, ధర్మం వేరు యిదీ వారి వాదన. వ్యవహారమందు శుద్ధ సత్యం అశక్యం, యధాశక్తి సత్యమాడటం శక్యం అని వారి అభిప్రాయం. నేను నా ఉపన్యాసంలో యీ విషయాన్ని గురించి కూలంకషంగా చర్చించి వాణిజ్య వేత్తలు రెండింతలు సత్య ప్రపర్తన గలిగి వుండాలని చెప్పాను. స్వదేశంలో కంటే విదేశంలో సత్య నిష్ఠ ఎక్కువగా వుండాలనీ, అందుకు విశేషకారణం వుందనీ, విదేశంలో కొద్దిమంది భారతీయుల అసత్య ప్రవర్తనను చూచి భారతదేశంలో గల కోటాను కోట్ల భారతీయులంతా యిదే రకమని యిక్కడి జనం భావిస్తారనీ, నొక్కి వక్కాణించాను.