పుట:సత్యశోధన.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

క్రైస్తవులతో పరిచయం

గ్రంధాలతో బాటు అతడు ఏసుభక్తుల్ని కూడా చాలామందిని నాకు పరిచయం చేశాడు. ఇట్టి పరిచయస్థులలో ప్లీమత్ బ్రదరన్ కుటుంబం కూడా ఒకటి.

ప్లీమత్ బ్రదరన్ అనునది ఒక ఏసు సంప్రదాయం. కోట్సుగారి ద్వారా నాకు పరిచయమైన వారంతా బాగా చదువుకున్నవారు. పాపభీరువులు. కాని యీ కుటుంబంలో ఒకరు యీ క్రింది విధంగా వాదించారు.

“మా మత సౌందర్యం నీవెరుగవు. మానవుడు తన పాపాలకు ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నీ వాదన అయితే జీవితమంతా ప్రాయశ్చిత్తాలతోనే గడిచిపోతుంది. ఎడతెగని యీ కర్మకాండ నుంచి ఎలా ముక్తి లభిస్తుంది? ఎన్నటికీ శాంతి లభించదు. మనమందరం పాపులం అని నీవూ అంటున్నావు. చూడు మాకెంత విశ్వాసమో! మన ప్రయత్నాల వల్ల ముక్తి వ్యర్ధం కాకూడదు. యీ పాపభారం ఎలా మోయగలం? దానిని ఏసుమీద వేయాలి. అతడొక్కడే పాపరహితుడు. అతనొక్కడే భగవానుని కుమారుడు. ఎవరు తనను నమ్ముదురో వారి పాపాలు పటాపంచలయిపోతాయని ఆయన వరం యిచ్చాడు. అది దేవుని అగాధమగు ఉదారతత్వం. ఏసు ముక్తి నీయగలడని నమ్ముదుమేని పాపాలు మనకంటవు. మనం పాపం చేయక తప్పదు. యీ ప్రపంచంలో పాపస్పర్శ తగలకుండా వుండేదెలా? కావున ఏసు ఒక్కడే రక్షకుడు అని నమ్మిన వానికే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. కావున శాంతి మీకా! మాకా?”

ఈ వాదం నాకు నచ్చలేదు. “నేను యీ ఏసు మతాన్ని అంగీకరించలేను. పాపాలు చేసి తత్ఫలం నాకంటరాదని నేనెన్నడూ ప్రార్ధించను. పాపకర్మ నుండి, పాప ప్రవృత్తినుండి విముక్తుడనగుటకు ప్రయత్నిస్తాను. అట్టి స్థితి చేకూరేదాకా నాకు అశాంతియే ప్రీతికరం” అని అన్నాను. అతడు బదులు చెబుతూ - “ఇదంతా నిష్ప్రయోజనం. మళ్లీ నేను చెప్పిన మాటల్ని బాగా ఆలోచించు.” అని అన్నాడు. పాపం అతడు బుద్ధిపూర్వకంగా పాపాల్ని అనుష్టించాడు. అంతటితో ఆగక వాటివల్ల తన మనస్సునకేమీ చింత లేదని మరీ మరీ చెప్పాడు.

ఇట్టి సిద్ధాంతాలు క్రైస్తవులందరికీ సమ్మతం కాదని వీరితో పరిచయం కాక పూర్వం నుండే నాకు తెలుసు. కోట్సు పాపభీరుడు. నిర్మలుడు. సాధనచే హృదయం శుద్ధమగునని అతని నమ్మకం. ఆ కుమారికల నమ్మకం కూడా అదే. నేను చదివిన గ్రంధాల్లో కొన్ని భక్తిపరమైనవి. ప్రీమత్ సోదరుని ప్రసంగం వల్ల నా బుద్ధి ఎలా మారునోయని కోట్సు భయపడ్డాడు. కాని అట్టి భయానికి అవకాశం లేదనీ, అతడేదో