పుట:సత్యశోధన.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
111
 

వాటి నన్నింటినీ చదువుతూ వున్నాను. చదివి అందలి విషయాన్ని గురించి ఆయనతో చర్చిస్తూ వుండేవాణ్ణి. 1893లో అట్టి గ్రంధాలు చాలా చదివాను. వాటి పేర్లన్నీ యిప్పుడు నాకు గుర్తు లేవు. ‘సిటీ టెంపుల్’ అను గ్రంధాన్ని గురించి పార్కరుగారు వ్రాసిన వ్యాఖ్యానం, పియర్సన్ గారు వ్రాసిన “ఇన్‌ఫొలిబిల్ ప్రూఫ్స్” బట్లరుగారు వ్రాసిన ‘అనాలజీ’ మొదలగునవి కొన్ని గుర్తువున్నాయి. ఈ గ్రంథాల్లో కొన్ని భాగాలు నాకు అర్థం కాలేదు. కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు. నా ఉద్దేశ్యాలు కోట్సుగారికి తెలుపుతూ వుండేవాడిని. బైబిల్ మతం పరమ ప్రమాణం అనడమే ఇన్‌పాల్‌బిల్ ప్రూఫ్ గ్రంధకర్త ఉద్దేశ్యం. యీ పుస్తకం నాకు నచ్చలేదు. పార్కరుగారి టీక నీతి వర్ధకమే గానీ ప్రచారంలో నున్న ఏసు మతం మీద విశ్వాసం లేని వారికది నిష్ప్రయోజనం. బట్లరుగారి అనాలజీ క్లిష్టమైన గంభీరమైన గ్రంథం. దీన్ని అయిదారుసార్లు చదవాలి. నాస్తికులను ఆస్తికులుగా మార్చడం యీ గ్రంధోద్దేశ్యం అని అనుకుంటాను. దేవుడు కలడు అని చెప్పే గ్రంధాలు నాకు లాభకారి కావు. నేను నాస్తికావస్థలో లేను. ఏసు ఒక్కడే అద్వితీయమైన అవతార పురుషుడనీ, అతడే మానవులకు, ఈశ్వరునకు సంధానకర్తయనీ చెప్పే సిద్ధాంతాలు నాకు హృదయంగమం కాలేదు.

కోట్సుగారు అంత మాత్రాన అపజయం అంగీకరించే రకం కాదు. ఆయనకు నాపై అమిత ప్రేమ ఏర్పడింది. ఒకనాడు ఆయన నా మెడలో తులసి దండ చూచాడు. చూచి ఖిన్నుడయ్యాడు. “ఈ గ్రుడ్డి నమ్మకం నీకు తగదు. దండ త్రెంపి ఇలా యివ్వండి” అని అన్నాడు.

“చూడండి యిది మా అమ్మగారి ప్రసాదం. అందు నమ్మకం వుందా లేదా నాకు అనవసరం. అందలి రహస్యం నాకు తెలియదు. దాన్ని ధరించకపోతే కీడు కలుగుతుందని నేను భావించను. ఆమె నా శ్రేయస్సు కోరి ప్రేమతో వేసిన యీ దండను ప్రబలమగు కారణం లేనిదే తీసివేయను. కాలం పక్వమై, అది జీర్ణమై తనంతటతాను తెగిపోతే మరోతులసిదండ వేసుకుందామనే లోభం నాకు లేదు. కాని దీన్ని మాత్రం తెంచడానికి వీలు లేదు.” అని చెప్పివేశాను. ఆయనకు నా వాదం నచ్చలేదు. నన్ను అజ్ఞాన కూపాన్నుండి బయటకు తీయటానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. మతాంతరములందు కొంత సత్యం వున్నా పూర్ణ సత్యం ఏసు మతమందే కలదనీ, ఆ మతం స్వీకరించనిచో మోక్షం చేకూరదనీ, ఏసునాధుడు మధ్యవర్తియై అడ్డుపడకపోతే పాపప్రక్షాళనం జరగదనీ, పుణ్యకర్మలతో ఏమీ ప్రయోజనం లేదనీ అతడు వాదించి నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే వున్నాడు.