పుట:సత్యశోధన.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

క్రైస్తవులతో పరిచయం

దొరుకుతాయి! నా మతాన్ని గురించి తెలుసుకోలేకపోతే క్రైస్తవ మతాన్ని గురించి ఏం తెలుసుకోగలను? యోచించి యోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను,

“నా చదువంతా నిష్పాక్షికంగా వుండాలి. ఈశ్వరుడు చూపించిన త్రోవన బేకర్ మిత్రుల బృందంతో బాటు సంచరించాలి. నా మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోనిదే యితర మతాన్ని అంగీకరించను. అట్టి ఆలోచనే పెట్టుకోను.” ఈ విధంగా ఆలోచిస్తూ వుండగా నిద్ర వచ్చేసింది.

11. క్రైస్తవులతో పరిచయం

మర్నాడు ఒంటి గంటకు బేకరుగారి చర్చికి వెళ్లాను. హారీస్ కుమారితోను, గాబ్ కుమారితోను, కోట్సు మొదలగు వారితోను పరిచయం అయింది. అంతా ప్రార్ధన కోసం మోకరిల్లారు. నేను వారిని అనుకరించాను. తమ కోరికలను గురించి ఈశ్వరుని వేడుకోవడం అక్కడి ప్రార్ధనా విశేషం. “ఈ దినం శాంతంగా గడుచుగాక అనిగాని, ఓ పరమేశ్వరా! నా హృదయద్వారాన్ని తట్టుదువుగాక” అనిగాని ప్రార్ధించడం అక్కడ మామూలు. కాని ఆ రోజున మాత్రం వారంతా “క్రొత్తగా వచ్చిన మా మిత్రునకు మార్గం చూపుము ఓ ప్రభూ! మాకు కలిగించిన శాంతినే అతనికి కూడా కలిగింపుము. మమ్ము రక్షించిన ఏసు రక్షకుడే ఇతనిని కూడా రక్షించుగాక. ఏసునాథుని పేరనే మేము యీ ప్రార్ధనలు చేస్తున్నాము.” అని వారంతా పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఈ సమాజంలో భజన కీర్తనలు లేవు. సంగీతం లేదు. ప్రతిదినం ప్రార్థన కాగానే అంతా వెళ్లిపోయేవారం. సరిగ్గా అది భోజనాల సమయం, ప్రార్ధనకు అయిదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు.

హారిస్, గాబ్ అను యిద్దరూ పెండ్లికాని ప్రౌఢలు. కోట్సుగారు క్వేకరు తెగవారు. పై స్త్రీలిద్దరూ ఒకేచోట నివసిస్తూ వుండేవారు. ప్రతి ఆదివారం నాలుగు గంటలకు తన యింట టీ త్రాగడానికి నన్ను ఆహ్వానించారు. ఆదివారాలందు కోట్సుగారూ, నేనూ కలిసినప్పుడు ఆవారం నేను చదివిన గ్రంధాల జాబితా తెలుపుతూ వుండేవాణ్ణి. వాటిని గురించి నా అభిప్రాయాలు కూడా తెలుపుతూ వుండేవాణ్ణి. కోట్సు హృదయం పరిశుద్ధమైనది. అతడు బోళావాడు, పట్టుదల గలవాడు. ఈయనకు నాకు స్నేహాం కలిసింది. తరుచు మేమిద్దరం కలిసి షికారుకు వెళుతూ వుండేవారం. ఆయన ద్వారా నాకు చాలామంది క్రైస్తవులతో పరిచయం కలిగింది. మా పరిచయం పెరిగిన కొద్దీ నా అల్మారాలో ఆయనిచ్చిన గ్రంధాల సంఖ్య పెరగసాగింది. ఆయన ఎడ గల శ్రద్ధ వల్ల