పుట:సత్యశోధన.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

నేను పడిన కష్టాలు

చూద్దుగాని, అని చిర్రు బుర్రులాడుతూ వున్నాడు. నేను మౌనం వహించి కూర్చున్నాను. దైవమా! సాయపడు అని లోలోన భగవంతుణ్ణి ప్రార్ధించసాగాను,

చీకటి పడింది. బండి స్టాండర్టన్ చేరింది. అక్కడ హిందూదేశస్థుల ముఖాలు కొన్ని కనబడ్డాయి. నా గుండె దడ కొద్దిగా తగ్గింది. నేను బండి దిగగానే వాళ్లు నాదగ్గరికి వచ్చి “మేము మీకోసమే వచ్చాము. ఈసా సేఠ్‌గారి దుకాణానికి వెళదాం. అబ్దుల్లా సేఠ్ గారు మాకు తంతి పంపారు.” అని అన్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. సేఠ్ ఈసా హాజీసుమర్‌గారి దుకాణానికి వెళ్లాము. ఆ సేఠ్, ఆయన గుమాస్తాలు నాచుట్టూ మూగారు. నేను జరిగిందంతా చెప్పాను. వాళ్లు విచారం వెలిబుచ్చారు. తాము పడ్డ కష్టాలన్నీ చెప్పి నన్ను ఓదార్చ ప్రయత్నించారు.

గుర్రపు బండ్ల కంపెనీ ఏజంటుకు జరిగిందంతా వ్రాసి పెద్దజాబు పంపించాను. లీడరు చేసిన దురాగతాన్ని గురించి, వాడి బెదిరింపును గురించి కూడా వ్రాశాను. మరుసటి రోజు బండిలో సరియైన ఏర్పాటు చేయమని వ్రాశాను. అందుకు వెంటనే ఆ ఏజంటు సమాధానం పంపాడు. “ఇక్కడి నుండి మీరు బయలుదేరిన బండి కంటే పెద్దబండి రేపు వస్తుంది. దాన్ని నడుపువాడు క్రొత్తవాడు. మిమ్ము బెదిరించినవాడు రేపు రాడు, మీరు బండి లోపలే కూర్చోవచ్చు.” అని అతడు పంపిన సమాధానంలో వుంది. నాకు బెంగ సగం తీరిపోయింది. నన్ను కొట్టిన వాడి మీద కేసు పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. అందువల్ల యీ వ్యవహారం అంతటితో ముగిసిపోయింది.

మర్నాడు ప్రొద్దున్నే ఈసా సేఠ్ గారి నౌకరు వచ్చి నన్ను గుర్రపు బండి ఎక్కించాడు. లోపల మంచి సీటు లభించింది. ఆ రాత్రికి సుఖంగా జోహాన్సుబర్గు చేరాను.

స్టాండర్టన్ చిన్న వూరు. జోహాన్సుబర్గుకు నారాకను గురించి తంతి యిచ్చారు. అచ్చట మహమ్మద్ కాసిం కమరుద్దీన్ గారి నౌకరు నన్ను తీసుకు పోయేందుకు వచ్చాడు. కాని నేను అతడిని చూడలేదు. అతడు నన్ను పోల్చలేదు. కమరుద్దీన్ గారి దుకాణం చిరునామా వివరం అబ్దుల్లాగారు నాకు తెలియజేశారు. యిక ఏదైనా హోటలుకు వెళదామని భావించాను. ఆ పట్టణంలోని కొన్ని హోటళ్ల పేర్లు నాకు తెలుసు. బండి కుదుర్చుకొని గ్రాండ్ నేషనల్ హోటలుకు వెళ్లాను. హోటలు మేనేజర్ని కలిసి ఒక గది యిమ్మని కోరాను. అతడు కొద్ది సేపు నన్ను ఎగాదిగా చూచి వినమ్రంగా గదులు ఖాళీ లేవు అని చెప్పి సలాం కొట్టి వెళ్లిపోయాడు. అప్పుడు కాసింకమరుద్దీన్ గారి దుకాణానికి వెళ్లాను. అచ్చట నా కోసం ఎదురు చూస్తున్న అబ్దుల్‌గనీ సేఠ్ గారిని