పుట:సత్యశోధన.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
103
 

బోధపడింది. కాని అవమానం మ్రింగడమే మంచిదని భావించాను. బలవంతం చేసి లోపల దూరడానికి వీలు వుండదు. నేను అక్కడ కూర్చోను అని అంటే అతడు నన్ను అక్కడే వదలి బండి తోలుకుపోతాడు. అక్కడ నేను వుండిపోతే ఆ రోజంతా వృధాయే. మర్నాడు ఏమవుతుందో ఆ భగవంతుడికే ఎరుక. కాబట్టి మనసులో ఎంత గుంజాటన పడుతూవున్నా నోరుమూసుకొని బండితోలేవాడి ప్రక్కన కూర్చున్నాను.

సుమారు మూడు గంటలకు బండి పార్డీకోవుకు చేరింది. అక్కడ ఆ గుర్రపు బండి అధికారికి నేను కూర్చున్నచోటున కుర్చోవాలని బుద్ధి పుట్టింది. అతడు సిగరెట్ కాల్చుకోవాలి. అతడికి తెరపగాలి కావాలి. అతడు బండి తోలేవాడి దగ్గర ఒక మైల గోనె సంచి తీసుకున్నాడు. దాన్ని నేను కూర్చున్న సీటు ముందు క్రింద పరిచాడు. “సామీ! నీవు దీని మీద కూర్చో. నేను బండి తోలు వాడి సీటు ప్రక్కన కూర్చుంటా” అని అన్నాడు. నేను ఆ అవమానం భరించలేక పోయాను. భయపడుతు భయపడుతు “లోపల కూర్చోవలసిన నన్ను యిక్కడ కూర్చోబెట్టావు. నేనెట్లో సహించాను. నీవు యిక్కడ కూర్చొని సిగరెట్ కాల్చుకునేందుకు నన్ను నీ కాళ్ల దగ్గర కూర్చోమంటున్నావు. నేను యిక్కడ కూర్చోను. బండి లోపలికి వెళ్లి కూర్చుంటాను.” అని అన్నాను.

ఈ మాటలు నానోటి నుండి బయటికి వచ్చాయో లేదో వాడు వెంటనే నా గూబ పగల కొట్టసాగాడు. నాచేయి పట్టుకుని క్రిందికి ఈడ్చి వేయడానికి ప్రయత్నించాడు. నేను ఆ బండి చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాను. మణికట్లు విరిగినా సరే చువ్వల్ని వదలకూడదని నిర్ణయించుకున్నాను. వాడు బండబూతులు తిట్టాడు. క్రిందకి పడత్రోసేందుకు ప్రయత్నించాడు. నేను మాత్రం బండి చువ్వల్ని వదలలేదు. అతడు బలిష్టుడు. నేను దుర్బలుణ్ణి. నా బాధ చూచి ప్రయాణీకులకు దయ కలిగింది. వారు కల్పించుకొని “పాపం, అతడిని విడిచి పెట్టు. అతడు చెప్పింది నిజం. అతని తప్పులేదు. అక్కడ కాకపోతే మాదగ్గరికి లోపలికి పంపు. మాకేమీ యిబ్బంది లేదు. లోపల సీట్లో కూర్చుంటాడు.” అని గట్టిగా అన్నారు. దానితో అతనికి అవమానమైంది. నన్ను కొట్టడం మానివేశాడు. “ముందున్నది ముసళ్ల పండగ, పద నీ అంతు తేలుస్తా” అంటూ అప్పుడు నన్ను వదిలి పెట్టాడు. బండికి ఆవలి ప్రక్కన కూర్చున్న సేవకుణ్ణి ఆ గోనె మీద కూర్చోబెట్టి అతని చోట తాను కూర్చున్నాడు.

ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు. ఈల మ్రోగింది బండి కదిలింది. నా గుండె దడదడ కొట్టుకున్నది. ప్రాణాలతో ఆ ఊరు చేరగలనా అని సంశయం కలిగింది. నడుమ వాడు నావంక కొరకొర చూస్తూ స్టాండర్టన్‌లో దిగు! అక్కడ నిన్నేమి చేస్తానో