పుట:సత్యశోధన.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

నేను పడిన కష్టాలు

యీవిషయం నాకు తెలిసింది. “యిందు రైల్వేవారి దోషం ఏమీలేదు. అయినా వెంటనే గాంధీకి సాయం చేయమని స్టేషను మాష్టరుకు తంతి పంపాను” అని ఆయన అబ్దుల్లాగారికి చెప్పాడు. అబ్దుల్లాగారు వెంటనే మారిట్జుబర్గులోని హిందూదేశపు వర్తకులకు మరికొందరికి తంతి పంపి రైలు స్టేషనులో వున్న గాంధీకి సాయం చేయమని కోరాడు. వారంతా రైలు స్టేషనుకు వచ్చి నన్ను కలిశారు. తమకు జరిగిన యిలాంటి అవమానాల్ని గురించి వారు నాకు చెప్పడం మొదలు పెట్టారు.

ఈ దేశంలో యిది క్రొత్తకాదని చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఫస్టు, సెకండు క్లాసుల్లో ప్రయాణం చేసే భారతీయ ప్రయాణీకులు ఏ రైలు ఉద్యోగుల చేతుల్లోనో, ఏ తెల్లవారి చేతుల్లోనో యిట్టి కష్టాలు పడేందుకు సిద్ధపడి వుండాలన్నమాట. ఆ రోజంతా మనవాళ్ల కష్టగాధలు వినడంతో సరిపోయింది. రాత్రి రైలు వచ్చింది. అందులో నా కోసం ఒక బెర్తు రిజర్వు చేయబడివుంది. దర్బానులో వద్దన్న పరుపు టికెట్టును మాత్రం యీ రోజున మారిట్జుబర్గులో కొన్నాను. ఆ రైలు నన్ను చార్లెస్ టౌనుకు తీసుకు వెళ్లింది.

9. నేను పడిన కష్టాలు

ప్రొద్దుటికి రైలు ఛార్లెస్ టౌను చేరింది. ఆ రోజుల్లో చార్లెస్ టౌనుకు, జోహాన్సుబర్గుకు మధ్య రైలు లేదు, రాక పోకలకు గుర్రపు బండ్లు వున్నాయి. గుర్రపు బండి త్రోవలో స్టాండర్టన్ అను ఊళ్లో రాత్రి పూట ఆగుతుంది. నా దగ్గర గుర్రపు బండి టిక్కెట్టు వుంది. మారిట్జుబర్గులో ఒక రోజు నేను వుండిపోయాను. ఆ టిక్కెట్టు రద్దుకాలేదు. అబ్దుల్లాసేఠ్ చార్లెస్ టౌనులోగల గుర్రపు బండ్ల ఏజంటుకు తంతి కూడా పంపాడు.

కాని ఆ ఏజంటు సరియైన వాడుకాడు. వాడు నన్ను దండుకోవాలని భావించాడు. నీ టిక్కెట్టు చెల్లదని అన్నాడు. నేను అందుకు తగిన సమాధానం చెప్పాను. బాటసార్లకు బండిలో చోటు యివ్వాలి. లోపల చోటువున్నా వాడు నన్ను బాధించాలనే భావంతో వ్యవహరించాడు. లీడర్ అను గుర్రపు బండ్ల అధికారి నన్ను తెల్లవారితోబాటు బండిలో కూర్చోనీయకూడదని అనుకున్నాడు. ఆ బండికి ముందుభాగాన రెండు వైపుల రెండు సీట్లు వున్నాయి. లీడరు ఆ రెండు సీట్లలో ఒకదాని మీద కూర్చుంటాడు. కాని యివాళ అతడు లోపలి సీట్లో కూర్చొని నాకు బయట తన సీటును చూపించాడు. అది శుద్ధ అన్యాయమనీ, అవమానకరమనీ నాకు