పుట:సత్యశోధన.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
101
 

వుంది. పరుపు అక్కర్లేదని చెప్పాను. అతడు వెళ్లిపోయాడు. ఇంతలో ఒక ప్రయాణీకుడు లోనికి వచ్చి నన్ను ఎగాదిగా చూచాడు. నేను నల్లవాణ్ణి. అతడు సహించలేక పోయాడు. పెట్టెదిగి వెళ్లి ఒకరిద్దరు ఉద్యోగుల్ని తీసుకువచ్చాడు. వారు వెటకారంగా నిలబడ్డారు. ఇంతలో మరో ఉద్యోగి వచ్చి “లేవయ్యా, లే, నీవు వెనుక పెట్టెలో కూర్చోవాలి. లే” అని గద్దించాడు.

“నా దగ్గర మొదటి తరగతి టిక్కెట్టు ఉన్నది. నా మాట మీరు వినండి. దర్బనులో నన్ను యిక్కడ కూర్చోనిచ్చారు. నేనిక్కడే వుంటాను.”

“అయితే పోవా? నీవు వెళ్లకపోతే పోలీసును పిలిచి నెట్టించి వేస్తాను.”

“సరే! అతడు వచ్చి నెట్టితే నెట్టనీ! నేను మాత్రం పోను.”

పోలీసువాడు వచ్చి నా చెయ్యి పుచ్చుకొని బయటికి దించివేశాడు. నా సామాను కూడా బయటికి విసరి వేశాడు. నేను మాత్రం వెనక పెట్టెలోకి పోనని భీష్మించాను. రైలు వెళ్లిపోయింది. నేను చేతిసంచి పుచ్చుకొని వైటింగు రూములోకి వెళ్లి కూర్చున్నాను. సామాను పడిపోయిన చోటనే వుంది, రైల్వేవారు దాన్ని కాపాడుతూ వున్నారు.

అది చలికాలం. దక్షిణ ఆఫ్రికాలోని పర్వత ప్రాంతలలో చలి అధికం. మారిట్జుబర్గు మరీ ఎత్తు మీద వున్నందున చలి మరీ ఎక్కువగా వుంది. నా ఓవర్ కోటు సామానులో వుంది. దాన్ని యిమ్మని కోరితే మళ్లీ అవమానిస్తారేమోనను భయంతో అడగలేకపోయాను. వణుకు పట్టుకున్నది. ఆగదిలో దీపంలేదు. అర్ధరాత్రి ఒక ప్రయాణీకుడు అక్కడికి వచ్చాడు. అతడు నన్ను పలకరించాలని భావించాడేమో కాని నేను మాట్లాడే స్థితిలో లేను.

ఇక ఏం చేయాలి అని ఆలోచించాను. నా హక్కుకోసం పోరాడాలా? లేక నోరుమూసుకొని ఇండియా దారి పట్టాలా? వచ్చిన పని పూర్తి చేయకుండా వెళితే అవమానం కదా. పిరికితనం కూడా. యిప్పుడు నేను పడ్డ కష్టం కొద్దే. ఇది మహారోగానికి బాహ్యచిహ్నం మాత్రమే. యీ మహారోగం వర్ణానికి అంటే రంగుకు సంబంధించింది. సామర్ధ్యం వుంటే యీ రోగమూలాన్ని పెరికి పారవేస్తాను. ఎన్ని కష్టాలైనా యిందు కోసం సహిస్తాను. వర్ణద్వేషానికి సంబంధించిన యీ జాడ్యాన్ని తొలగించేందుకై ఎంత కృషి అయినా సరే చేస్తాను. యీ విధంగా ఆలోచించి తరువాత వచ్చే రైల్లో ప్రిటోరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మర్నాడు రైల్వే జనరల్ మేనేజరుకు ఒక పెద్ద టెలిగ్రాం పంపాను. అబ్దుల్లా సేఠ్ వెంటనే జనరల్ మేనేజర్ని కలిసి మాట్లాడాడు.