పుట:సత్యశోధన.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
99
 

ఈ విధంగా నా పరిచితుల సంఖ్య పెరిగిపోసాగింది. యింతలో అబ్దుల్లాగారి వకీలు నుంచి వారికి ఒక సమాచారం అందింది. ఇక కేసుకు సిద్ధం కావాలి. అందువల్ల అబ్దుల్లాగారే రావడమో, లేక వారి తరపున మరొకరినెవరినైనా పంపడమో చేయమని ఆ సమాచార సారాంశం. అబ్దుల్లాగారు నాకా లేఖను చదవమని యిచ్చి ప్రిటోరియాకు వెళతారా అని అడిగారు. “నేను ఆ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలుసుకొని వెళతాను. అక్కడ ఏం చేయాలో నాకిప్పటికి తెలియదు.” అని నేను చెప్పాను. అప్పుడు ఆయన ఆ విషయం నాకు బోధపరచమని కొందరు గుమాస్తాలను ఆదేశించాడు.

ఆ కేసును కొంత ఆకళింపు చేసుకున్న తరువాత అసలు యీ కేసును ఓం నమఃశ్శివాయతో ప్రారంభించవలసియున్నదని అర్థం చేసుకున్నాను. జాంజిబారులో వున్న కొద్ది రోజులు అక్కడి కోర్టుకు వెళ్ళి వివరాలు తెలుసుకున్నాను. పార్శీ వకీలొకడు ఒక సాక్షి ఖాతాలోగల జమా ఖర్చులను గురించి అడుగుతూ వుండటం గమనించాను. జమాఖర్చులంటే నాకు అంతా అడవి గొడవ. నేను హిందూదేశపు స్కూళ్ళలోగాని, ఆంగ్లదేశంలో గాని జమా ఖర్చులను గురించి నేర్చుకోలేదు.

దక్షిణ ఆఫ్రికాకు ఏకేసును గురించి నేను వచ్చానో అదంతా ఖాతాలకు సంబంధించిందే. జమా ఖర్చుల లెక్కలలో నిపుణుడైన వాడే వాటి వివరాలు తెలుసుకోగలడు. ఇతరులకు తెలుపగలడు. గుమాస్తా యిది జమ, ఇది ఖర్చు అని చెప్పుకు పోతూ వుంటే నాకంతా గందర గోళంగా వుంది. పి.నోటు అంటే ఏమిటో నాకు బోధపడలేదు. ఇంగ్లీషు నిఘంటువును తిరగవేశాను. ఆ శబ్దం ఎక్కడా కనబడలేదు. నా యిబ్బంది ఆగుమాస్తాకు తెలియజేశాను. ఆ గుమాస్తా వెంటనే పి. నోటు అంటే ప్రాంశరీ నోటు అని చెప్పాడు. అప్పుడూ జమా ఖర్చులకు సంబంధించిన పుస్తకం ఒకటి కొని చదివాను. దానితో కొంత ధైర్యం వచ్చింది. ఆదావా నాకు అర్థమైంది. అబ్దుల్లాసేఠ్ జమా ఖర్చులు ఎలా వ్రాయాలో ఎరుగడు అయినా ఎంత చిక్కులెక్కనైనా చిటికెలో విడదీసి చెప్పగల అనుభవం ఆయన గడించాడని నేను తెలుసుకున్నాను. “ప్రిటోరియా వెళ్ళడానికి యిప్పుడు నేను సిద్ధం” అని అన్నాను.

“మీరెక్కడ బస చేస్తారు?” “మీరు ఎక్కడ బస చేయమంటారో చెప్పండి.” “నేను మన వకీలుకు జాబు వ్రాస్తాను. ఆయన మీకు విడిది ఏర్పాటు చేస్తాడు. ప్రిటోరియాలో నాకు మేమన్ మిత్రులున్నారు. వాళ్ళకి కూడా వ్రాస్తాను. అయితే మీరు వారి ఇంట్లో బస పెట్టవద్దు. మన ప్రతిపక్షులకు అక్కడ మంచి పలుకుబడి వుంది. మన రహస్య పత్రాలు వారిలో ఎవరైనా చూచారో, కొంప మునుగుతుంది. వారికి మీరు ఎంత దూరంగా వుంటే అంత మంచిది.